- ఏపీలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలి
- ఉత్పత్తులకు విలువ జోడింపుతో మార్కెట్ విస్తరణ
- డ్వాక్రా సంఘాలకు సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యత
- వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పూర్వోదయ మిషన్లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించు కోవాల్సిన ప్రణాళికలపై సీఎం చంద్రబాబు శనివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకో వాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు.. వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని.. అలాగే రాష్ట్రాభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధాన పంట లతో పాటు… అంతర పంటలు వేయడం ద్వారా కూడా ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలన్నారు. అలాగే జాతీయంగా.. అంతర్జాతీయంగా హై డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి.. ఆ మేరకు ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి… దానికి అనుగుణంగా ఆ పంటలు సాగు చేసేలా రైతులను ప్రొత్సహించాలని చెప్పారు. మన వాతా వరణంలో ఏయే పంటలు పండుతాయో అధ్యయనం చేసి.. మన వాతావరణంలో పండించగలిగే అన్ని రకాల పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం వివరించారు.
రైతులను పరిశ్రమలకు అనుసంధానం చేయాలి
రైతులను పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా చేయగలిగితే… రైతులు పంట ఉత్పత్తి, ధర విషయంలో నష్టం లేకుండా ఉంటుందన్నారు. ఈ మేరకు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల (ఎఫ్పీఓ)ను ప్రొత్సహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎప్పీఓలకు కేంద్రం ఆర్థికంగా అండగా నిలుస్తోందని చంద్రబాబు వివరించారు. ఉద్యాన రంగ రైతులకు.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అందరికీ కలిసి వచ్చేలా ఓ వర్క్ షాప్ నిర్వహించాలని ఆదేశించారు. అన్ని రకాల ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబులిటీ వచ్చేలా చూడాలని చెప్పారు. అలాగే ఆక్వా ఉత్పత్తుల సాగు రెట్టింపయ్యేలా చూడాలన్నారు.
ఆక్వా కల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాజిస్టిక్స్ను కూడా పూర్తిగా వినియోగించుకోగలిగితే అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. ప్రతి రైతుసేవా కేంద్రం పరిధిలో 2 వేల హెక్టార్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు ఉన్నాయని… ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏయే పంటలు ఉన్నాయనే విషయాన్ని విశ్లేషించి… రైతులకు అన్ని రకాలుగా అవగాహన కల్పించేలా రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్లస్టర్ ఆధారంగా పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పశువుల కోసం ఏర్పాటు చేసే సామూహిక షెడ్ల నిర్వహణ, పశు పోషణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతో పాటు.. పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పశువుల సంఖ్యను పెంచడం, పాల ఉత్పత్తి పెరిగేలా చూడడం… పశు వ్యాధులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. ఆ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.