- దారిలో డ్రైవర్ కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ఆరా
- పేదల జీవన ప్రమాణాలు పెంచుతామని భరోసా
అమరావతి (చైతన్యరథం): ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉండవల్లి నుంచి విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకూ సీఎం చంద్రబాబు నాయుడు 14 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించారు. తాడేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ ఆటోలో ఆయన కుటుంబసభ్యులు సతీమణి తస్లీం, కుమారుడితో కలిసి ప్రయాణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఆటోలో ప్రయాణించటంపై ఆటో డ్రైవర్ ఆఫ్సర్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రయాణ సమయంలో ఆటో డ్రైవర్ అప్సర్ ఖాన్ కుటుంబ ఆర్థిక స్థితిగతుల్ని, సాధక బాధకాల్ని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచి ఆటో డ్రైవింగ్ వృత్తిలో ఉన్నారంటూ అఫ్సర్ ఖాన్ ను ప్రశ్నించారు. అఫ్సర్ ఖాన్ కుమారుల చదువుల గురించి, వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాల గురించీ ఆరా తీశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారా అంటూ అఫ్సర్ ఖాన్ సతీమణిని అడిగి తెలుసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్లు వస్తున్నాయా, కుటుంబ సభ్యులు ఎవరైనా పెన్షన్.
తీసుకుంటున్నారా అని వివరాలు తెలుసుకున్నారు. ఊబర్ లాంటి ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆటో కిరాయి వచ్చేలా చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడానికే కృషి చేస్తున్నామని వివరించారు. అలాగే పిల్లలను చక్కగా చదివించుకోవాలని… పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూడాలని ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ దంపతులకు సీఎం సూచించారు. అమరావతి రాజధానికి ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తాయని.. అఫ్సర్ ఖాన్ కుమారులు ఇక్కడే ఉద్యోగాలు పొందవచ్చని సీఎం చెప్పారు. విజయవాడ నగరంలో నెలకొన్న పరిస్థితులు, వాట్సప్ గవర్నెన్సు సేవల వినియోగంపైనా ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి సమాచారం తెలుసుకున్నారు. ప్రజలందరి కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ తెచ్చామని తెలిపారు.
కరెంటు ఛార్జీలు వచ్చే నెల నుంచి తగ్గుతాయని… భవిష్యత్తులో మరింత తగ్గిస్తామని తెలిపారు. గతంలో రోడ్లన్నీ గోతులతో ఉండేవని… ఇప్పుడు ఆ సమస్య తీరిందని సీఎంకు ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ వివరించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా అప్సర్ ఖాన్ తాజాగా రూ.15వేల ఆర్థిక సాయం అందుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా అప్సర్ ఖాన్ కుటుంబానికి రూ.13 వేలు కూటమి ప్రభుత్వం అందించింది. దీపం 2.0 ద్వారా మూడు సిలెండర్లు ఆ కుటుంబానికి ఉచితంగా అందాయి. గత ఏడాది బుడమేరు వరదల్లో ఆటో మునిగిపోవటంతో మరమ్మతులకు అప్సర్ ఖాన్ కు కూటమి సర్కార్ రూ.10 వేలు చెల్లించింది.