అమరావతి (చైతన్యరథం): అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న గిరిజన సహకార సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అరకు వ్యాలీ కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సీఎం చంద్రబాబును మంత్రి సంధ్యారాణి, ఎండీ కల్పన కుమారి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును, ప్రశంసా పత్రాన్ని సీఎం పరిశీలించారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్గా మారిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రియ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువానలతో పాటు… ప్రత్యేక రుచిని కలిగి ఉందన్నారు. ఈ విశిష్టత కారణంగా అరకు కాఫీకి మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందని సీఎం చెప్పారు. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల జీసీసీ- టాటా కన్స్యూమర్ ప్రొడెక్ట్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో దేశంలో తొలిసారిగా ఆర్గానిక్ సాల్యూబుల్ కాఫీ ఉత్పత్తి కానుందని సీఎంకు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి వివరించారు. నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం గ్రామంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తిగా బీన్ టు కప్ మోడల్ అభివృద్ధి కానుందని… తద్వారా అరకు కాఫీకి మరింత మార్కెట్ వస్తుందని మంత్రి సంధ్యారాణి వివరించారు.