- 2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తవ్వాలి
- ఈ ఏడాది నవంబరు నుంచే ప్రధాన డ్యామ్ పనులు
- పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థల ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు
పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు.
బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74శాతం మేర పూర్తయినట్లు సీఎంకు తెలియ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచే ప్రారంభించాలని.. 2027 డిసెంబరుకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే సొరంగాల నిర్మాణం, ఎడమ కాలువకు అనుసంధానం చేసేలా అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్, కేఎల్ బండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఎడమ కాలువను 2026 జనవరి నాటికల్లా అనకాపల్లి వరకూ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పరిహార, పునరావాసాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పోలవరం వద్ద పర్యాటక ఆకర్షణలు
దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరంవద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటి కప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్ కు అనుసంధానించాలని సూచించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ను వచ్చే వర్షాకాల సీజన్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు సీఎస్ కే. విజయానంద్, జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.