- రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేస్తాం
- దసరా రోజు ఆటో డ్రైవర్లకు రూ.15 వేలిస్తాం
- రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఆగని అభివృద్ధి, సంక్షేమం
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
- క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
- కొండపి నియోజవర్గంలో ఇప్పటి వరకు
- 880 మందికి రూ.7.27 కోట్లు పంపిణీ
తూర్పు నాయుడుపాలెం (చైతన్యరథం): ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.32.23 లక్షల నిధుల చెక్కులను 63 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి డా. స్వామి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తుందన్నారు. ఆనారోగ్యంతో వైద్యశాలలలో చేరి, అధిక ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటోంద న్నారు. దుర్గాష్టమి పండుగ రోజున 63 మందికి రూ.32.23 లక్షల విలువైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కొండపి నియోజకవర్గం లో 880 మందికి రూ.7.27 కోట్ల నిధులను సీఎంఆర్ఎఫ్ కింద అందజేశామ న్నారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం త్వరలోనే సంజీవిని కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంతో పేదలను ప్రతినెల ఆదుకుంటోందన్నారు. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింద న్నారు. ఆటో డ్రైవర్లకు రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని మరో రెండు రోజుల్లో అందిస్తుందన్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి నిధి అందిస్తోందన్నారు. దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ ఇస్తున్నట్లు వివరించారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయగా, మరో ఆరువేల పోస్టులను పోలీస్ శాఖలో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని మంత్రి డా. స్వామి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.