- ఢిల్లీలో ఎయిర్బస్ పూర్తిస్థాయి బోర్డుతో సమావేశం
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
- ప్రపంచస్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన
- రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన మంత్రి
- యూనిట్ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామని హామీ
న్యూఢిల్లీ (చైతన్యరథం): విమానాల తయారీ సంస్థ,ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎయిర్ బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్తో పాటు ఎయిర్ బస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్,మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు. మేకిన్ ఇండియా,స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డ్ మొదటిసారి భారతదేశానికి వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎయిర్బస్ ప్రతినిధులను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఏపీలో ప్రపంచస్థాయి ఏరో స్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలో ఎయిర్ బస్ ఆధారిత ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పని చేసేలా ప్రతిపాదనను మంత్రి లోకేష్ వారి ముందుంచారు. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు ప్రాజెక్ట్ వేగవంతంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరో స్పేస్ పాలసీని వివ రించారు. తద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్ తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
ప్రధాన యూనిట్తో పాటు ఇంటిగ్రేటెడ్ క్లస్టర్
ప్రధాన యూనిట్తో పాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ను ఏర్పాటుచేయాలని ఎయిర్ బస్ ను మంత్రి నారా లోకేష్ కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్క్ లు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృతస్థాయిలో తయారీ సాధ్యం అవుతుందని వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్లో అనేక సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఎయిర్ బస్ ప్రోగ్రామ్ అవసరాలకు, సరఫరాదారుల క్లస్టరింగ్, రవాణ సౌకర్యాలు, భవిష్యత్ విస్తరణలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు.
ఈ భేటీ కోసం మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా న్యూఢిల్లీ వెళ్లారు. రాష్ట్రప్రభుత్వ పెట్టుబడిదారుల ప్రాధాన్య విధానాన్ని, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్దిష్ట గడువులోగా ప్రాజెక్ట్ అమలు వంటి అంశాలతోపాటు సీఎం చంద్రబాబు బ్రాండ్, ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ఆయన ట్రాక్ రికార్డ్ను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై ఏపీ దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఎయిర్ బస్ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ అందిం చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.