అమరావతి (చైతన్య రథం): వీక్షిత్ భారత్ ఆవిష్కరణకు వృద్ధి ఇంజన్గా ఏపీ సాక్షాత్కరించ నుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్రెజర్కు కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో కలిసి పాల్గొన్నారు. ప్రపంచ, జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయ బారులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. “30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్రెజర్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి మీతో మాట్లాడే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ నవంబర్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. మా వ్యాపార అనుకూల విధానాలు, దృఢమైన భవిష్యత్తుకు సిద్ధంగావున్న పర్యావరణ వ్యవస్థ ద్వారా పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచాము. స్వర్ణాంధ్ర నిర్మాణానికి మేము కృషి చేస్తున్నాం. అదే -వీక్షిత్ భారత్ ఆవిష్కరణకు కీలకమైన వృద్ధి ఇంజిన్గా మారనుంది. మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, పరిశ్రమలు, సమ్మిళిత పాలనపై బలమైన దృష్టితో, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పరివర్తన చెందడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపిస్తుంది. మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం అందించే విస్తారమైన అవకాశాలను అన్వేషించమని ప్రపంచ, జాతీయ వాటాదారులను నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ విశాఖపట్నంలో స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ పోస్టులో సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.