- వ్యవస్థల సక్రమ నిర్వహణతో రాష్ట్రానికి మేలు
- జీఎస్టీ కుదింపు… విద్యుత్ కొనుగోలు అంశాలే నిదర్శనం
- జీఎస్టీ సంస్కరణల లాభాలను ప్రజలకు వివరించాలి
- రాష్ట్రాదాయం తగ్గినా.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది
- విద్యుత్ వ్యవస్థను కూటమి సర్గారు గాడిన పెట్టింది
- తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు.. ప్రజలకే మేలు
- సుమారు రూ.1000 కోట్లు ఆదా చేయగలిగాం..
- ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని నియత్రిస్తున్నాం
- సాధించిన విజయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి
- అసెంబ్లీకి వైసీపీ డుమ్మా… మండలిలో డ్రామాలు
- వైసీపీ రాజకీయానికి పునాది.. ఫేక్ ప్రచారమే
- పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు
- భవిష్యత్ కార్యాచరణపై టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): వ్యవస్థలను గాడిలో పెట్టి… సక్రమంగా నిర్వహించినప్పుడు, సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు ప్రజలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో ఆదివారం ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని మించినస్థాయిలో సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. “జీఎస్టీ సంస్కరణల ఫలాలను ప్రజలకు వివరించేందుకు అక్టోబర్ 19వరకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ప్రచార కార్యక్రమాల్లో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రచారంలో భాగంగా 60 వేల సమావేశాలు నిర్వహించి… 1.6 కోట్ల కుటుంబాలను కలవాలి. జీఎస్టీ 2.0 ప్రయోజనాలను వివరించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతుంది. ఏ సంస్కరణలు వచ్చినా వాటిని వినియోగించుకోవాలి.
జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యాయం. గతంలో 4 శ్లాబులుంటే ఇప్పుడు 5, 18 శాతం శ్లాబులకు కుదించారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలి. జీఎస్టీ ఉత్సవ్లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దాం. పారిశ్రామిక, ఆటోమొబైల్, ఫార్మావంటి రంగాలపై జీఎస్టీ సంస్కరణల ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. ఆ రంగాల అభివృద్ధికి జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయి. ద్విచక్ర వాహనాలు, ఏసీలు, కార్లువంటి వాటిపై జీఎస్టీ బాగా తగ్గింది. మంచి చేసినప్పుడు ప్రజలకు పదేపదే చెప్పినప్పుడే ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనాలు వివరించగలిగినప్పుడే పాలనపట్ల ప్రజలు సానుకూలంగా ఉంటారు. జీఎస్టీ సంస్కరణల కారణంగా ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. తద్వారా మన రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లు ఆదా అవుతాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణలవల్ల ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారు. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రధాని తీసుకున్న జీఎస్టీ 2.0 నిర్ణయంపై ధన్యవాద తీర్మానం చేశాం. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ద్వారా కార్యక్రమం ఏడాదిలో ప్రజలకు ఏం చేశామో వివరించాం. అదే తరహాలో జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమాన్నీ చేపట్టాలి. యోగా డేను మించి జీఎస్టీ ఉత్సవ్ను సక్సెస్ చేయాలి” అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ కొనుగోలులో రూ.1000 కోట్ల ఆదా
“సంస్కరణలు, వ్యవస్థల సమర్థ నిర్వహణవల్ల లాభాలు ఏస్థాయిలో ఉంటాయో… ప్రజలకు ఎంతటి మేలు జరుగుతుందోననే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణలు జీఎస్టీ పన్నుల కుదింపు, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు అంశాలే. జీఎస్టీ సంస్కరణల వల్ల పన్ను శ్లాబులు కుదింపు ఆచరణలోకి వచ్చింది. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టి.. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టడం వల్ల రూ.1000 కోట్లు ఆదా అయ్యింది. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టింది. దీంతో విద్యుత్ ఛార్జీల కొనుగోలు భారం ప్రజలపై పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం. ఓ ప్రణాళిక ప్రకారం విద్యుత్ కొనుగోలును చేపట్టాం. రాష్ట్ర విద్యుత్ అవసరాలను… డిమాండును దృష్టిలో పెట్టుకుని… ముందుగానే సమీక్షించుకుని తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో మాట్లాడుకుని స్వాపింగ్ విధానాన్ని అవలంభించాం. ప్రణాళికాబద్ధంగా విద్యుత్ కొనుగోలు చేపట్టాం. దీంతో ఈ విధానం ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం. గతంలో ఎన్నడూలేని విధంగా ట్రూ డౌన్ తెచ్చాం. గతంలో ఎప్పుడు చూసినా… ట్రూ అప్ ప్రతిపాదనలే ఉండేవి. కానీ తొలిసారి ట్రూ డౌన్ వచ్చేలా చేశాం. ఇలా ఆదా చేసిన డబ్బుతో ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాం. సమర్థతకు…అనుభవానికి వచ్చిన ఫలితమిది. దీనివల్ల ప్రజలపై రూ.1,000 కోట్ల భారం తగ్గింది. ప్రభుత్వ డబ్బులే కదా ఖర్చు అయిపోతే మనకేంలే అని అనుకోలేదు. ప్రతి రూపాయిని బాధ్యతాయుతంగా ఖర్చు చేస్తున్నాం. అందుకే వ్యవస్థలను సరిగా నిర్వహించాలని.. సంస్కరణలను స్వాగతించాలని చెబుతున్నా. జీఎస్టీ సంస్కరణల ద్వారా ధరలు ఏవిధంగా తగ్గాయి. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి.. సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజలపై రూ.1000 కోట్ల భారాన్ని తగ్గించగలిగాం. ఇలాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సూపర్ సిక్స్… సూపర్ హిట్
“సూపర్ సిక్స్ పథకాలు హిట్టయ్యాయి. ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మెగా డీఎస్సీ… మెగా హిట్టయ్యింది. నియామకపత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వారి కళ్లలో ఆనందం చూసి సంతోషించా. 15 నెలల కాలంలో 4.71 లక్షలమందికి ఉద్యోగాలిచ్చాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2. 0వంటి పథకాలు సక్సెస్ చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల కడుపులు నింపుతున్నాం. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇవ్వనన్ని పెన్షన్లు ఏపీలోనే ఇస్తున్నాం. హంద్రీనీవా పూర్తి చేసి కుప్పంకు నీళ్లు ఇచ్చాం. పోలవరం పూర్తి చేస్తున్నాం. ఇతర సాగునీటి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. ఏటా 6 వేల టీఎంసీ సముద్రం పాలవుతున్నాయి. ఒకరోజు సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే కరవు అనేది లేకుండా చేయొచ్చు. రోజుకు 150 టీఎంసీ చొప్పున నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు వివరించాలి. ఇదే కాకుండా.. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పథకాన్ని వర్తింప చేస్తున్నాం. ప్రతి లబ్దిదారునికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు వివరించాలి” అని సీఎం సూచించారు.
ఏ ఎన్నికలొచ్చినా కూటమే గెలవాలి
“ప్రజలకు మేలు చేసేలా చాలా పథకాలు అందిస్తున్నాం. నిత్యం పేదల గురించే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించాలి. నేతలు మొదలుకుని.. కార్యకర్తల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. మంచి చెడు విడమరిచి చెప్పగలగాలి. వారి కష్టనష్టాల్లో నేతలు భాగం కాగలిగితే.. వాళ్లు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కూడా మనల్నే గుర్తుంచుకుంటారు. ఏ ఎన్నిక వచ్చినా.. ఏ స్థాయి ఎన్నిక వచ్చినా… కూటమి పార్టీలదే గెలుపు అన్నట్టుగా ఉండాలి. ఎన్నికల సమయంలోనే వెళ్తే ప్రజలూ మెచ్చరు. మనం ఏ పని చేసినా ప్రజామోదం ఉందా..? లేదా..? అనేది చూసుకోవాలి. కార్యకర్తలు, నేతలు ప్రజలతో మంచిగా ఉంటే.. పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుమీద అనునిత్యం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదేవిధంగా నేతల పని తీరు మీదా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నాం. మంచి చేస్తే మరింత ప్రోత్సహిస్తా. పార్టీ, ప్రజల కోసం పని చేసేవారే నాకు దగ్గరవుతారు. మాటలు చెప్పి కాలక్షేపం చేసేవారికి నా దగ్గర స్థానం లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారమే వైసీపీ ఆచారం
“రాష్ట్రంలో ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. తప్పుడు పోస్టులు పెడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. వాళ్లు పెట్టే ఒక్క పోస్టుకూ ఆధారం ఉండదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. వైసీపీనుంచి గెలిచిన 11మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. మండలిలో మాత్రం రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం చేసే మంచి పనినే కాదు.. వైసీపీ చేసే దుష్ప్రచారాలను.. డ్రామాలను కూడా ప్రజలకు వివరించాలి. ఈ బాధ్యతను నేతలు, కార్యకర్తలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.