- వేట నిషేధభృతి రూ.20 వేలకు పెంచాం
- వైసీపీ హయాంలో మత్స్యకారులకు అనేక ఇబ్బందులు
- ఫిష్ ఆంధ్ర పేరుతో దోచుకున్నారు
- డెయిరీల్లో అక్రమాలపై విచారణ అనంతరం చర్యలు
- అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థకశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో శనివారం మత్స్యకారుల అభివృద్ధి, పలు డెయిరీల అవినీతిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 2014-2019 తెదేపా ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు స్వర్ణయుగం అన్నారు. రూ.4000 వేట నిషేధ భృతిని అందచేశాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రూ.20,000 అందచేస్తున్నాం. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి మత్స్యకారులకు కావలసిన మౌలిక సదుపాయాలను వారికి నచ్చిన విధంగా అందచేశాం. వైసీపీ హయాంలో మత్స్యకారులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి తూట్లు పొడిచి వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడికి తెగబడింది… ఫిష్ ఆంధ్ర కోసం రూ. 155.69 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కేవలం రూ.51.44 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం వెనుక మర్మమేమిటి. ఫిష్ ఆంధ్ర పేరుతో నాలుగు అద్దాలు, ఫ్రిజ్ పెట్టి ఏర్పాటు చేసిన 8 పెద్ద షాపులలో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి.
ఒక్కోదానికి రూ.1 కోటి చొప్పున ఖర్చు చేశారు. ఒక్కో షాపునకు రూ.50 లక్షల వ్యయం చేసి 36 మధ్యరకం షాపులు ఏర్పాటు చేస్తే 5 మాత్రమే పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఒక్కోదానికి రూ.20 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన 15 చిన్న షాపుల్లో 2 మాత్రమే పనిచేస్తున్నాయంటే వైసీపీ ప్రభుత్వ చిత్తశు ద్ధి అర్థమవుతుంది.
ఫిష్ ఆంధ్ర వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం లేదు. నగదు దోచుకునేందుకు జగన్ వేసిన పథకం ఇది. వైసీపీ హయాంలో పెట్టిన రూ.16 కోట్ల డీజీల్ సబ్సిడీ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది, ఇటీవల మరో రూ.7 కోట్ల సబ్సిడీ నగదును మత్స్యకారులకు అందచేశాం. వైసీపీ హయాంలో ప్రమాదాలకు గురై మరణించిన 63 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిహారాన్ని అందచేసింది. మృతి చెందిన మరో 100 మందికి త్వరలోనే పరిహారాన్ని అందచేస్తాం. వైసీపీ పాలనలో ఆధ్వానంగా తయారైన మత్స్యకారుల జీవితాల్లో పూర్వవైభవం తీసుకొస్తున్నాం. వారికి కావలసిన మౌలిక సదుపాయాలను వారికి నచ్చిన విధంగా అందచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో రూ.4000 ఖర్చుతో ప్రతి బోట్ కు శాటిలైట్ ట్రాన్స్పాండర్ ను ఏర్పాటు చేసాం. వాటి వలన చేపలు ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకొవచ్చు. ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు. ఎన్ ఎఫ్ డీ బీ ఇన్యూరెన్స్ పథకంలో భాగస్వామ్యం అయ్యి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.10 లక్షలు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. లోతట్టు ప్రాంతాలలో జీవించే మత్స్యకారులకు అన్ని సదుపాయాలను అందచేస్తాం. సీడ్, వీడ్ కల్చర్ అభివృద్ధికి చర్యలు చేపట్టాం.. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సీడ్ కల్చర్ అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి.. పనులు ముందుకు సాగుతున్నాయి. కేజ్ కల్చర్ను కూడా
అభివృద్ధి చేస్తాం
రాష్ట్రంలోని పలు పాల డెయిరీల అవినీతిపై చర్యలకు సిద్ధమవుతున్నాం. విజయ, విశాఖ డెయిరీల్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గుతేల్చేందుకు అధికారులను నియమించి ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే నివేదిక వస్తుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.