- బీఎస్ఎన్ఎల్ దేశంలో ఓ శక్తివంతమైన సంస్థ
- నాలెడ్జి ఎకానమీ దశను యువత అందుకోవాలి
- బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): స్వదేశీ 4జీ నెట్వర్క్ దేశంలో కనెక్టివిటీ విప్లవం సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశీయంగా తయారు చేసుకున్న సాంకేతికతతో దేశంలోని మారుమూల ప్రాంతాలన్నీ అనుసంధానం కావటం ప్రగతికి సూచికగా అభివర్ణించారు. శనివారం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒడిశాలోని ఝార్సుగూడ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించిన స్వదేశీ 4జీ నెట్వర్క్ కార్యక్రమంలో సీఎం వర్చువల్గా పాల్గొన్నారు. దేశంలోని 97,500 ప్రాంతాల్లో 4జీ స్వదేశీ నెట్వర్క్ న్ను బీఎస్ఎన్ఎల్ అందించనుంది.
ఏపీలోని 10 మారుమూల గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 108 గ్రామాల్లో 4జీ సేవలను ప్రధాని మోదీ పర్చువల్ ప్రారంభించారు. నడిపించే నాయకుడు లేక దేశం ఇన్నాళ్లూ అవస్థలు పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి సరైన నేతగా ప్రధాని మోదీ సరైన స్థానంలో ఉన్నారన్నారు. అందుకే స్వదేశీ 4జీ నెట్వర్క్ంటి విప్లవాత్మక మార్పులు దేశంలో చోటుచేసుకుంటున్నా యని సీఎం వ్యాఖ్యానించారు. 1995 నుంచి దేశం టెక్నాలజీపరంగా, సమాచార సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలని కలగన్నానని.. అదిప్పుడు సాకారమవుతోందని సీఎం తెలిపారు. గతంలో టెలికామ్ రంగంలో ఇచ్చిన నివేదికతో ఇప్పుడు ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
డీ రెగ్యులేషన్లాంటి సంస్కరణలు ఈ మార్పునకు కారణమని స్పష్టం చేశారు. ఒక బిలియన్ సబ్ (స్క్రైబర్లు కలిగిన కమ్యూనికేషన్ నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ దేశంలోనే ఓ శక్తివంతమైన సంస్థగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1 లక్ష 4జీ సైట్లను ఏర్పాటు చేసి 4 పెటా బైట్ల డేటాను ప్రతీ రోజూ అందించటం అభినందనీయమన్నారు. మొత్తం 26,707 మారుమూల గ్రామాలను 4జీ టెక్నాలజీతో అనుసంధానించటం దేశ ప్రగతికి మరో కీలకమైన ముందడుగు అవుతుందన్నారు. 4జీ స్టాక్ తయారు చేసుకున్న అతితక్కువ దేశాల్లో భారత్ ఒకటిగా మారటం చారిత్రాత్మకమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బీఎస్ఎన్ఎల్కు ప్రధాని మోదీ అదనపు నిధులు కేటాయించి శక్తివంతంగా తయారుచేశారని ప్రశంసించారు. భారత్లో తయారైన కోవిడ్ వాక్సిన్ వంద దేశాల్లోని వారినీ కాపాడిందని సీఎం వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే తీసుకువచ్చిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విధానం ఇప్పుడు ఫ్రాన్స్, సింగపూర్లాంటి దేశాల్లోనూ వాడుతున్నారన్నారు. భారత్ తయారు చేసిన చాలా ఉత్పత్తులు, సాంకేతికతను విదేశాలు వినియోగిస్తున్నాయని సీఎం అభినందించారు.
నాలెడ్జ్ ఎకానమీతోనే సంపద
ప్రస్తుతం ప్రపంచమంతా నాలెడ్జ్ ఎకానమీ దశలో ఉందని.. దీనిని మనదేశ యువత అందిపుచ్చు కోవాలని అప్పుడే సంపద సృష్టి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో మొబైల్ ఫోన్ ద్వారా 735 పౌరసేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. 4జీలాంటి సేవల ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన సెల్ఫోన్లు ప్రపంచ దేశాలు వాడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని 14.30 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని వివరించారు. స్మార్ట్ ఫోన్ కారణంగా ఆర్ధిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెరిగాయని స్పష్టం చేశారు. 2030 నాటికి 6జీ కూడాఅందుబాటులోకి వచ్చేస్తుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేశాయని.. 2026 జనవరినాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రకరకాల యాప్స్ ద్వారా 90 శాతం విదేశీ కంపెనీలకు డబ్బు చెల్లిస్తున్నామని, ఈ పరిస్థితి మారాలని సీఎం పిలుపునిచ్చారు. పేటెంట్స్ కూడా గరిష్టంగా నమోదు కావాలని అన్నారు. 2047నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుం దని.. భారతీయులు, తెలుగువాళ్లు నెంబర్-1గా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే బీఎస్ఎన్ఎల్ నుంచి మరిన్ని కొత్త ఆవిష్కరణలు రావాలని.. వినియోగ దారులకు మరింత మెరుగ్గా ఆ సంస్థ సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.