- టీంగా పని చేసి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం
- డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సంక్షేమం, అభివృద్ధి
- అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో.. పథకం
- ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఒక్కొక్కరికీ రూ.15 వేలు
- స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- అసెంబ్లీలో సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై సమాధానం
అమరావతి (చైతన్య రథం): “డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకే.. 15 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలను చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తోంది. ఇదో టీం.. ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా… విఘాతం కలిగించేలా వ్యవహరించినా.. రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యేలు పర్సనల్ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అడ్డంకి కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలు చర్చలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్టు సభలో సీఎం ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కలిసి కట్టుగా పని చేయాలని ప్రజా ప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… “టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నాం.
కలిసి ఉన్నాం కాబట్టే… ఇవన్నీ చేయగలుగుతున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అక్టోబర్ 4నన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం కింద సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తాం. ఈ పథకానికి అర్హులుగా 2,90,234మంది డ్రైవర్లున్నారు. ఏదైనా కారణాలతో లబ్దిదారుల జాబితాలో అర్హులైనవారి పేరు లేకపోతే… వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో స్కీంను వర్తింపచేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి యేటా రూ.435 కోట్ల ఖర్చవుతుంది. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.15 వేలు అందించేందుకు నిర్ణయించింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆలోచించి పేదల సేవలో.. పేరు పెట్టాం
“ప్రతినెలా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఎంతో ఆలోచించి పేదల సేవలో.. అని పేరు పెట్టాం. ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తోంది. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెద్దఎత్తున ఫించన్లు ఇస్తున్నాం. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనన్ని ఫించన్లను మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫించన్లను ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సచివాలయాల ఉద్యోగులు పోటీ పడి తొలిరోజునే 97 శాతం ఫించన్ల పంపిణీని పూర్తి చేస్తున్నారు. నెలకు రూ.2745 కోట్లను ఫించన్లకు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా 63.50 లక్షలమందికి ఫించన్లను పంపిణీ చేస్తున్నాం. ఫించన్లు అందుకుంటున్న వారిలో 59 శాతం మహిళలే. పింఛన్లు ఇవ్వడమే కాదు.. పంపిణీ ఎలా జరుగుతుందన్న అంశంపైనా లబ్దిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఏడాదికి రూ.32,143 కోట్లు పెన్షన్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఏపీ తర్వాత తెలంగాణ, కేరళ రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో ఏడాదికి రూ.8,179 కోట్లు, కేరళ రూ.7295 కోట్లు పెన్షన్లు కింద ఖర్చు పెడుతున్నాయి. అంటే పెన్షన్ల కోసం ఏపీ ఖర్చు పెట్టే దాంట్లో పావు వంతు ఖర్చు పెడుతున్నాయి” అని సీఎం వివరించారు.
స్త్రీ శక్తి పథకం సంతృప్తినిచ్చింది
“స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలు 8.86 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. స్త్రీ శక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది. ఉచిత బస్సు స్కీంకు ఏడాదికి రూ.2963 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది.. అయినా ఫర్వాలేదు.. ఆనందంగా ఖర్చు పెడతాం. స్త్రీ శక్తి పథకం నాకు సంతృప్తినిచ్చిన పథకం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 97 శాతంమందికి స్త్రీ శక్తి పథకం గురించి తెలుసు. 85 శాతం స్త్రీ శక్తి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకం అమలుతో సోషల్ గేదరింగ్ పెరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణాల వల్ల డబ్బు కూడా ఆదా అయింది. ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకు స్త్రీ శక్తి పథకం తోడ్పడింది” అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
తల్లికి వందనం అందని వారుంటే దరఖాస్తు చేసుకోవచ్చు
“తల్లికి వందనం పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేశాం. ఈ పథకానికి రూ.10,090,74 కోట్లను ఖర్చు పెట్టాం. ఎంతమంది పిల్లలుంటే.. అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేశాం. ఇప్పటికీ తల్లికి వందనం పథకం ఎవరికైనా అందకుంటే వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 2,79,720 మందికి రూ.363.64 కోట్లు అందచేస్తున్నాం. మొత్తంగా తల్లికి వందనం లబ్దిదారులు 66,57,508 మంది విద్యార్థులు ఉన్నారు. దీపం-2.0 పథకం అమలు చేశాం. నా తల్లి వంటింట్లో పడే కష్టాలను చూసి… మరే మహిళా ఆ కష్టాలు పడకూడదని ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం పెట్టాం. ఇప్పుడు దీపం-2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటివరకు 2.66 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు అందచేశాం. దీని నిమిత్తం రూ.1718 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది” అని చంద్రబాబు వివరించారు.
లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష్యం
“డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేశాం. డ్వాక్రా మహిళలు పెద్దఎత్తున డబ్బులను పొదుపు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి పూర్తిస్థాయిలో చెల్లిస్తున్నారు. డ్వాక్రా మహిళల్లో కేవలం 1శాతం మాత్రమే ఎన్పీఏలుగా ఉన్నారంటే మహిళా శక్తి ఏంటో అర్థం చేసుకోండి. చాలా పరిశ్రమలు, చాలామంది అప్పులు తీసుకుని ఎన్పీఏలుగా మారుతున్నారు. కానీ డ్వాక్రా సంఘాలు మాత్రం తీసుకున్న అప్పులను నిఖార్సుగా తిరిగి చెల్లిస్తున్నారు. లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే 1000 మంది మహిళలను గుర్తించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలి” అని సీఎం సూచించారు.
రైతు కుటుంబం నుంచి వచ్చా… రైతులను ఆదుకుంటున్నా
“అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుకు సాయం అందిస్తున్నాం. రైతు కుటుంబంనుంచి వచ్చాను.. రైతును ఆదుకునే బాధ్యతను తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. రైతుకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాకింద రూ.7500 ఇస్తే.. కూటమి ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తోంది. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ పథకంతో జోడించి ఇస్తున్నాం. ఇప్పటి వరకు మొత్తంగా 46.86 లక్షల రైతులకు రూ.3174 కోట్లను అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం అందజేశాం. ఇదేకాకుండా.. రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ, స్పెషల్ ప్యాకేజీలు ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైన ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 1.34 లక్షలమంది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ను సబ్సీడిపై అందిస్తున్నాం. గత ప్రభుత్వం మార్కెట్ ఇన్వెన్షన్ ఫండ్ పేరుతో మోసం చేసింది. హెబ్రీ బర్లీ పొగాకు, మామిడి, కోకో, టమాట, కాఫీ తోటలు, మిరప, ఉల్లివంటి పంటలను కొనుగోలు చేశాం. ఉల్లి రైతులను ఆదుకునేందుకు నష్టపోయిన పంటకు హెక్టారుకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.100 కోట్లు భరిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం రూ.12,858 కోట్లు ఖర్చు పెట్టాం. ఆక్వా రైతులకు రూ.991 కోట్లు భరించి రూ.1.50 లకే విద్యుత్ ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యం
“రాష్ట్రంలోని యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 4,71,574 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా పరిశ్రమలకు మ్యాన్ పవర్ అందించేలా చూస్తాం. ఉద్యోగాల కల్పన ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. 2014-19 మధ్యకాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది. కానీ ఏపీలో దౌర్భాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాం. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటి వరకు అన్న క్యాంటీన్ల ద్వారా 5.72 కోట్ల భోజనాలు పెట్టాం.. రూ.104 కోట్ల మేర సబ్సిడీని అందించాం. ప్రతి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం చేపడతాం. రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార పంపిణీ చేపడుతున్నాం. దీనికోసం రూ.14,070 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రేషన్ మాఫియాను అరికడుతున్నాం. రేషన్ డిపోలను పునఃప్రారంభించాం” అని చంద్రబాబు అన్నారు.
ఏ రాష్ర్టంలో లేనివిధంగా ఆరోగ్య బీమా
“దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా యూనివర్శల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ తరహా పాలసీ మరే ఇతర రాష్ట్రంలోనూ లేదు. 1.63 కోట్లమంది పేదలకు రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందించేలా పాలసీ రూపొందిం చాం. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా ఏడాదికి వేట విరామ సమయంలో రూ.20 వేలు అందిస్తున్నాం. మత్స్యకారులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 217 రద్దు చేశాం. పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్లు అందిస్తున్నాం. బీసీలకు సబ్సిడీ మీద, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లు అందిస్తాం” అని సీఎం స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జూన్కు 6.15 లక్షల ఇళ్లు అందుబాటులోకి
“అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. వచ్చే ఏడాది జూన్నాటికి 6.15 లక్షల ఇళ్లను అందుబాటులోకి తెస్తాం. 2029నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఇవే కాకుండా.. మేనిఫెస్టో హామీలను చాలావరకు అమలు చేశాం. చెత్తపన్నును రద్దు చేశాం. రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా చూశాం. విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు తెచ్చాం. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
దేవుళ్ల విగ్రహాలే కదా అని హేళన చేశారు..
“గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడ్డారు. రామతీర్ధంలో రాముని తలనుతీసేశారు. అంతర్వేదిలో రథాన్ని తగులపెట్టారు. దుర్గమ్మ గుళ్లో వెండి సింహాలను దొంగిలించారు. ఇదేంటని ప్రశ్నిస్తే… విగ్రహాలే కదా వేరే విగ్రహాలు పెట్టుకోండని ఎద్దేవా చేసినట్టు మాట్లాడారు. టీటీడీలో కూడా చాలా అపచారాలు చేశారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నాం. ఉచిత ఇసుక పాలసీలో ఇప్పటికీ కొన్ని అంశాలు నా దృష్టికి వస్తున్నాయి. ఉచిత ఇసుకలో అక్రమాలు చోటు చేసుకోకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలే చూసుకోవాలి. గత ప్రభుత్వం ఇసుకలో పెద్ద స్కాంకు పాల్పడింది. దేశంలో బెస్ట్ ఎక్సైజ్ పాలసీ తెచ్చాం. వ్యవసాయానికి ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తున్నాం. ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం. ఇంకా పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యలను త్వరలో తీరుస్తాం. చెప్పిన మాటకు కట్టుబడి అన్నీ చేస్తున్నాం. పీ4లో భాగంగా స్వచ్ఛంధంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చాం. మొత్తంగా 99,822 మంది మార్గదర్శులు 9,68,513 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పీ4 వేదిక. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా అందరూ పని చేయాలి” అని సీఎం కోరారు.
ఊపిరి ఉన్నంతకాలం పేదల కోసమే పని చేస్తా
“ఇప్పటి వరకు 14సార్లు తిరుమల వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎవ్వరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. పెద్దఎత్తున క్లైమోర్ మైన్లు పెట్టి నన్ను హతమార్చాలని చూశారు. వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టాడు. ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పని చేస్తా. పేదల కోసమే అనునిత్యం ఆలోచన చేస్తున్నాను. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం.. తెలుగు జాతిని నెంబర్-1 రాష్ట్రంగా చేయడానికి నేను పని చేస్తున్నాను. అలాగే అందరూ పని చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.