అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. దీనిద్వారా సుమారు 16వేల మందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయలేదు. నోటిఫికేషన్ దగ్గరనుంచి ఎగ్జామ్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. రేపు కొత్త ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతులమీదుగా నియామక ఉత్తర్వులు అందించబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి గర్వకారణం. ఎమ్మెల్యేలంతా హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రతిపక్ష సభ్యులకూ జీఏడీ ద్వారా ఆహ్వానం పంపించాం. కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారినీ కోరుతున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ సుమారు వందకుపైగా కేసులు వేసింది. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్క స్టే కూడా రాలేదు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. రేపు సచివాలయం వెనుక వైపు నిర్వహించే భారీ కార్యక్రమానికి టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతోపాటు వారి కుటుంబసభ్యులు కలిసి సుమారు 32 వేలమంది హాజరుకాబోతున్నారు. వేదిక వద్ద ప్రతిజిల్లాకు ఒక్కొక్క జోన్ ఏర్పాటుచేశాం. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సంబంధిత జోన్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. స్థలాభావంవల్ల అందరికీ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. శాసనమండలి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… డిఎస్సీ విషయంలో మంత్రి లోకేష్ కృషికి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసే అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తిచేశారని ప్రశంసించారు.