- ప్రతి నియోజకవర్గానికీ జూనియర్ కళాశాల ప్రభుత్వ లక్ష్యం
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 5వరోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. గత ఏడాది నవంబర్ లో గురజాల ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ఈమేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజన తర్వాత చిత్తూరు జిల్లా పరిధిలో ప్రభుత్వరంగంలో ద్రవిడియన్, ప్రైవేటురంగంలో అపోలో వర్సిటీలు ఆ జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు వర్సిటీ ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ద్రవిడియన్ వర్సిటీ చిత్తూరులో ఉన్నప్పటికీ అది లాంగ్వేజ్ స్పెసిఫిక్ వర్సిటీ. కలసికట్టుగా పనిచేసి చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడులో హైస్కూలును జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య కోరగా, మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ… గత సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. ‘హైస్కూలు ప్లస్ విధానంతో కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ఈ విధానాన్ని ప్రక్షాళన చేశాం. ప్రభుత్వ కళాశాలల్లో 40శాతం అడ్మిషన్లు మెరుగుపర్చాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశాం, కాంపిటీటీవ్ మెటిరీయల్ ఇస్తున్నాం. ఎగ్జామ్స అవసరమైన మెటీరియల్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందిస్తున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దుతాం. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పం. దానికి కట్టుబడి ఉన్నాం. తుని ఎమ్మెల్యే దివ్య చేసిన విజ్ఞప్తిపై వివరాలు తెప్పించుకొని నిర్ణయం తీసుకుంటాం. రాబోయే రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.