- రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మత్తులు
- మరో రూ. 104 కోట్లతో నూతన హాస్టళ్ల నిర్మాణం
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంఘిక సంక్షేమశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఈ సంధర్బంగా మంత్రి డా. స్వామి మాట్లాడుతూ…. విశాఖ జిల్లా పెందుర్తిలో బాలికల కాలేజీ వసతి గృహ నిర్మాణం కోసం రూ.3 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పెందుర్తిలోని బాలికల వసతి గృహానికి రూ. 8.65 లక్షలతో, బాలుర కాలేజీ వసతి గృహానికి రూ. 13.20 లక్షలతో మరమ్మతులు చేశామని మంత్రి తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.143 కోట్లతో రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులు చేశామన్నారు. టాయిలెట్ల నిర్మాణానికి ప్రత్యేకంగా రూ. 23 కోట్లు కేటాయించామన్నారు. మరో రూ. 104 కోట్లతో నూతన హాస్టళ్లు నిర్మిస్తున్నామని మంత్రి డా. స్వామి తెలిపారు.