- ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహణ
- నవంబర్ లో మళ్లీ టెట్.. టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తాం
- 150 కేసులు వేసినా 150రోజుల్లో విజయవంతంగా డీఎస్సీ పూర్తిచేశాం
- గురువుల మార్గదర్శనం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా
- నా జీవితకాల గురువు నాన్న చంద్రబాబే
- మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఇకపై ప్రతిఏటా డీఎస్సీ నిర్వహిస్తాం, నవంబర్లో టెట్ చేపడతాం, వచ్చేఏడాది మళ్లీ పారదర్శకంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయం సమీప ప్రాంగణంలో గురువారం జరిగిన మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 150 రోజుల్లో డీఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడుతరాలు డీఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సమష్టి కృషితో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికే దిక్సూచిగా మారుద్దాం.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అంతా కలసికట్టుగా కృషిచేద్దాం. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు వ్యవస్థలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థిమిత్ర, డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9600 స్కూళ్లలో వన్ క్లాస్- వన్ టీచర్ విధానాన్ని తెచ్చాం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుని క్యాబినెట్ ర్యాంకుతో సలహాదారుగా నియమించాం. కారు, ఫోన్ తోపాటు కనీసం బాటిల్ నీరు కూడా ఆయన తీసుకోలేదు. ఆయన నిబద్ధతను అభినందిస్తున్నా. నైతిక విలువలపై తాను రాసిన నాలుగు పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఆయన కోరారు. మహిళలను గౌరవించడం నర్సరీ నుంచే నేర్పించాలి. మార్పు మన ఇంటినుంచే రావాలి. మా ఇంట్లో మా తల్లిని ఎంతో గౌరవిస్తున్నాం. 1,2 తరగతుల పుస్తకాల్లో ఇంటిపనుల ఫోటోలను చెరో సగంగా ఉండేలా మార్పులు చేశాం. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాం.. శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. నైతిక విలువలు, లింగ సమానత్వం, రాజ్యాంగం గురించి పాఠాలు రూపొందించామని మంత్రి లోకేష్ తెలిపారు.
డీఎస్సీ అంటే సీబీఎన్…
తెలుగుదేశంపార్టీ విద్యకు ఎప్పుడుప్రథమ ప్రాధా న్యత ఇస్తోంది. సీబీఎన్ అంటే డీఎస్సీ… డీఎస్సీ అంటేనే సీబీఎన్ పేరుపడింది. ఇప్పటివరకూ 14 సార్లు డీఎస్సీలు నిర్వహించి 2 లక్షల టీచరు పోస్టులు భర్తీ చేశాం. సెప్టెంబర్ 5న టీచర్స్ డే కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారు చేతులు ఎత్తాలని కోరితే… హాలులో 99 శాతం మంది చేతులు ఎత్తారు. ఇదీ తెలుగుదేశంపార్టీ ఘనత… ఇదీ చంద్రబాబు డీఎస్సీల చరిత్ర. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. చాలా మంది హేళనగా మాట్లాడారు.. కొందరు విమర్శించారు. కానీ డీఎస్సీల నిర్వ హణలో టీడీపీ, చంద్రబాబు ట్రాక్ రికార్డు వీరెవ్వరికీ తెలియదు. బాబు ఒక్కసారి కమిటైతే.. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకూ ఆగరని ఈ డీఎస్సీ రిక్రూట్మెంట్ స్పష్టం చేసిందని మంత్రి లోకేష్ అన్నారు.
అడ్డుకోవాలనే కుట్రతో కేసులు వేయించారు
డీఎస్సీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనే కుట్రతో కొందరు 150కి పైగా కేసులు వేయించారు. అధికారులు.. న్యాయ సలహాలు తీసుకుంటూ ఎటువంటి లీగల్ సమస్యలు రాకుండా చూసు కున్నారు. 150 కేసులను న్యాయపరంగా ఎదు ర్కొంటూనే 150రోజుల్లో డీఎస్సీ విజయవంతం గా నిర్వహించారు. మెగా డీఎస్సీ మెగా హిట్ కావడానికి కృషిచేసిన అధికారులు కోన శశిధర్, విజయరామరాజు, బి.శ్రీనివాసరావు, ఆకుల వెంకటరమణలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ను. మెగా డీఎస్సీ ప్రక్రియను 150 రోజుల్లోనే పూర్తిచేసి రికార్డు సృష్టించాం. సుమారుగా 16 వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేయడం మరో రికార్డు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత నిర్వ హించిన మొదటి డీఎస్సీలోనే దానిని అమలు చేశాం. స్పోర్ట్స్ కోటా 3శాతం కూడా ఈ డీఎస్సీ లో అమలు చేశాం. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, స్పోర్ట్స్ కోటా సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లు పకడ్బందీగా పాటించాం. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలకు అవకాశాలు దక్కాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో 49.9శాతం పోస్టులను మహిళలు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
యువగళం యాత్రలోనే మెగా డీఎస్సీ ఆలోచన
ఇంట్లో మొదటి గురువు అమ్మ. హెడ్ మాస్టర్ నాన్న. బడిలో గురువులే అమ్మానాన్నలు. అమ్మానాన్నల తరువాత పిల్లలు ఎక్కువ ఉండేది టీచర్ల తోనే. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. అది దొంగలు దోపిడీ చెయ్యలేరు. అన్నదమ్ములు వాటాలు అడగరు. ఇతరులు మోసం చేసి తీసుకోలేరు. అదే విద్య. ఎంతో విలువైన విద్య అనే ఆస్తిని ఇప్పుడు ఎంపికైన టీచర్లందరూ పిల్లలకు ఇవ్వబోతున్నారు. యువగళం పాదయాత్ర నుండి పుట్టింది మెగా డీఎస్సీ ఆలోచన. పాదయాత్రలో నడిచేప్పుడు యువతీయువకులతో మాట్లాడితే వాళ్ళు ఒక్కటే చెప్పేవారు. మేమంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం. వైసీపీ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ వేయాలి అని కోరేవారు. అప్పుడే మెగా డీఎస్సీ ఆలోచన మొదలైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డీఎస్సీపైన పెడతారని అప్పుడే చెప్పాను. నూతన ఉపాధ్యాయులంతా పట్టుదల, కమిట్మెంట్తో పనిచేయాలి. విద్యావ్యవస్థలో మార్పుతేవాలి. విద్య అంటే ఫిన్ ల్యాండ్, ఢిల్లీ మాత్రమే కాదు. ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. వ్యవస్థలో మార్పు తెస్తానని విద్యాశాఖను కోరి మరీ తీసుకున్నా. అందరం కలసికట్టుగా పనిచేద్దాం, ప్రపంచానికి ఆంధ్రామోడల్ చూపిద్దాం. అయిదేళ్లలో ప్రతి విద్యార్థికి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందిద్దాం. ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్ల్యాండ్, సింగపూర్ దేశాలకు అధ్యయనం కోసం పంపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
గురువుకు దక్కిన గొప్పగౌరవం
ఒక గురువు దక్కిన గొప్ప గౌరవం గురించి ఈ రోజు మీకు చెబుతాను. అది ໑໖ 3, 1996 సంవత్సరం. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఒమన్ దేశం అధికారిక పర్యటనకు వెళ్లారు. మస్కట్ ఎయిర్ పోర్టుకు ఏకంగా ఒమన్ రాజు ఖబూస్ బిన్ సైద్ వచ్చేశారు. ఆ దేశ అధికారులంతా కంగారు పడిపోయారు. ప్రోటోకాల్ నిబంధనలు పక్కనపెట్టి రాజు ఎయిర్ పోర్టుకి రావడం ఏంటని షాక్ అయ్యారు. తాము ఏమైనా తప్పు చేశామా అని అందరూ భయపడుతున్నారు. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మను ఒమన్ రాజు సాదరంగా స్వాగతించారు. రాజు తన కారులో శంకర్ దయాళ్ శర్మను ఎక్కించుకుని, తానే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఏమీ అర్థంకాని ఒమన్ ఉన్నతాధికారులు.. ప్రోటోకాల్ ఇలా బ్రేక్ అవడంపై సీరియస్ అయ్యారు. ఒమన్ రాజభవనంలోకి చేరాక తెలిసింది ఏంటంటే ఒమన్ రాజు గతంలో పూణేలో చదువుకున్నారు. అప్పుడు ఆయనకు పాఠాలు చెప్పింది మన శంకర్ దయాళ్ శర్మ అట. ఒమన్ రాజు తన గురువుకి ఇచ్చిన గౌరవం చూశారు కదా. దేవుడు, గురువు ఒకేసారి ఎదురుపడితే మొదట గురువుకే నమస్కారం చేస్తానన్నారు గురు కబీర్ దాస్. అది గురువుల గొప్పతనమని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
నాకు లైఫ్ టైమ్ గురువు చంద్రబాబే
దేశానికి అధినేత అయినా గురువు దగ్గర చదువుకున్న విద్యార్థే. వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ కూడా ఒక గురువుకు స్టూడెంటే. ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, లీడర్, లాయర్… ఎవ్వరైనా ఓ గురువు వద్ద శిష్యుడే. సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు కృష్ణుడితో సమానమైన గురువు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. బాలికా విద్య కోసం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే ఎంతగానో కృషి చేసారు. నాకు లైఫ్ టైం గురువు మా నాన్న చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొచ్చారు. వాళ్లు చెప్పిన పాఠాలు, కొట్టిన దెబ్బలు ఇంకా నాకు గుర్తున్నాయి. స్కూల్లో మాది గోల బ్యాచ్… మేము ఫ్రెండ్స్ ఆఫ్ ఫస్ట్ బెంచర్స్. అంటే మాది లాస్ట్ బెంచ్. కానీ లాస్ట్ బెంచ్ నుండి స్టాన్ఫోర్డ్లోకి నా ప్రయాణం ఎలా జరిగిందో మీకు చెబుతాను. స్కూల్లో మంజులా మ్యాడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మ్యాడం నేర్పిన డిసిప్లిన్ నాకు గుర్తున్నాయి. ఇంటర్ లో నారాయణ మాస్టారు బ్రిడ్జ్ కోర్సు. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాజిరెడ్డి మార్గదర్శకత్వాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా, ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూ ఉంటారని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.