- గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు
- మంత్రి లోకేష్ ఛాంబర్ లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
- కార్యాచరణ ప్రణాళికపై విస్తృతంగా చర్చ
అమరావతి (చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతిఒక్కరికి అందేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కూటమి ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సమావేశమయింది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు,
అధికారులు విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబుకి నివేదించనున్నారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.