- సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చిస్తామన్న సీఎం
- సమర్థ నీటి నిర్వహణతోనే అభివృద్ధి సాధ్యం
- సాగు నీటి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు..
- పట్టిసీమ వద్దన్నారు… పోలవరాన్ని నాశనం చేశారు
- హంద్రీ-నీవాతో సీమలో హర్షాతిరేకాలు
- సాగునీటి రంగంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అమరావతి (చైతన్య రథం): సమర్థ నీటి నిర్వహాణతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో వివరించారు. అలాగే భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నామనేది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇరిగేషన్ రంగానికి సంబంధించిన అంశంపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతోపాటు.. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగంలో ఆడిన డ్రామాలపై రూపొందించిన వీడియోను ముఖ్యమంత్రి సభలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఏపీలో 1.06 కోట్ల ఎకరాలకు నీటిని అందిస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం ఐదేళ్లలో రూ.60 వేల కోట్లను జలవనరుల శాఖకు ఖర్చు చేస్తాం. 94 శాతం రిజర్వాయర్లలో నీళ్లు నింపిన జలవనరుల శాఖకు అభినందనలు. 1040 టీఎంసీ నీళ్లు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి.
వాటర్ యూజర్స్కమిటీలకు కూడా కూటమి అధికారంలోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించి ప్రతినిధుల్ని నియమించాం. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడానికి చర్యలు చేపట్టాం. ఈసారి 2.1శాతం వర్షపాతం తక్కువగా పడింది. అయినా నీటి నిర్వహణవల్ల గతంతో పోలిస్తే 1.5మీటర్లమేర భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం 8.43 మీటర్లమేర భూగర్భజలాలు ఉన్నాయి. భూ గర్భంలో 697టీఎంసీ నీరు ప్రస్తుతం అందుబాటులో ఉంది. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను నింపాలి. భూగర్భజలాలను రీఛార్జి చేసుకోవాలి. నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుంటే కరవు అనే మాట రాష్ట్రంలో ఉండదు. ఏపీని కరవురహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూటమి తీసుకుంటుంది” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
పట్టిసీమ వద్దన్నారు…
పోలవరాన్ని నాశనం చేశారు
“రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. జూన్ 2కంటే ముందే 7 ముంపు మండలాలను కలపాలని ప్రధానిని కోరాను. పార్లమెంటు సమావేశానికంటే ముందు ముంపు మండలాలు కలుపుతూ ఆర్డినెన్సును తెచ్చాం. ఆ నిర్ణయంతోనే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లింది. భూసేకరణ, కాంట్రాక్టుల వివాదాలు, కుడి కాలువలాంటి సమస్యలను దాటుకుని 2019నాటికి 72 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశాం. స్పెల్వే, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్ పనులు, కుడి కాలువ పనులు వందశాతం పూర్తి చేశాం. గతంలో రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించాం. గత పాలకుల అసమర్థత వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకు పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక… మళ్లీ రూ.1000 కోట్లతో కొత్తగా మళ్లీ నిర్మిస్తున్నాం. 2025 డిసెంబరునాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పనుల్ని రూ.960 కోట్లతో చేపడుతున్నాం. దీనిని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లిస్తాం. రూ.894 కోట్ల నిధులు నిర్వాసితులకు ఇచ్చాం. 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు 3.84 శాతం మాత్రమే. 2021కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 7 ఏళ్లు వెనక్కినెట్టారు. పోలవరం ప్రాజెక్టు
నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లింది మేమే. ఐదేళ్లపాటు పోలవరం పనులను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లిస్తాం. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 439 టీఎంసీ నీటిని కృష్ణాడెల్టాకు తరలించాం. పొదుపు చేసిన నీటిని శ్రీశైలంనుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించి నీరిచ్చాం. గత ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను వినియోగించలేదు. ప్రజా ధనంతో కట్టినపట్టిసీమను వాడకుండా వదిలేశారు. టీడీపీ ప్రభుత్వంలో పట్టిసీమ కట్టారని… దాని తాము వాడడంఏంటనే అహంభావంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రెండేళ్లపాటు అసలు నీటిని తరలించలేదు. మూడో ఏడాది కరువు వస్తే.. ఇంకా నీటిని విడుదల చేయకుంటే తంతారని పట్టిసీమ ప్రాజెక్టును వినియో గించారు. బేషజంతో ప్రభుత్వ ఆస్తులను వినియోగించ కుండా ప్రజలను, రైతులను నష్టపరిచే ప్రయత్నం చేశారు. టీడీపీకి పేరు వస్తుందనే పట్టిసీమను ఐదేళ్లలో వినియోగించలేదు. ప్రజావేదికను కూల్చి విధ్వంసంతో మొదలుపెట్టి విధ్వంసంతోనే ఓడిపోయారు” అని చంద్రబాబు వెసీపీ పాలనను ఎండగట్టారు.
హంద్రీ-నీవాతో సీమలో హర్షం
“1987లో ఎన్టీఆర్ సంకల్పించిన హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల నీటిని తరలించి చిట్టచివరి ప్రాంతానికి తీసుకెళ్లాం. వంద రోజుల్లోనే రూ.3800 కోట్లను మంజూరు చేసి 3850 క్యూసెక్కుల నీటిని పారిస్తున్నాం. పులివెందుల చెరువుకు కూడా నీటిని కూటమి ప్రభుత్వమే ఇస్తోంది. హంద్రీ-నీవాపై ఇప్పటి వరకూ రూ.13 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ మేర నీటిని తరలించుకోవచ్చు. 497 చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నాం. రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటిని నింపేలా ప్రణాళికలు చేసుకున్నాం. ఆగస్టు 30న కుప్పానికి నీళ్లిచ్చి జలహారతి ఇవ్వటంతో నా జన్మ సార్ధకమైంది. రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు వేరుశనగ విత్తనాలు వేస్తే ఖర్చు కూడా రాని పరిస్థితి ఉండేది. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. అలాంటి ప్రాంతానికి నీటిని తరలించేలా చేశాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.