- సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు
- ఈ లబ్ధి గ్రామస్థాయి వరకు ప్రతి కుటుంబానికీ చేరాలి
- జీఎస్టీ సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలిరాష్ట్రం ఏపీ
- రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా.. ప్రజా ప్రయోజనాల కోసం నిలబడిన సీఎం చంద్రబాబు
- శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి (చైతన్యరథం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా భారత దేశం మరో గొప్ప దశలోకి ప్రవేశించనుంది.. జీఎస్టీ సంస్కరణల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది.. దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది.. తద్వారా మార్కెట్లో డిమాండ్ పెరిగి కొత్త పరిశ్రమల రాకకు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమష్టి నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి అమలు చేయబోతున్న జీఎస్టీ 2.0 సంస్కరణలపై శాసన సభలో గురువారం జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇది దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లబ్ధి చేకూర్చే నిర్ణయం అన్నారు. జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతి పెద్ద సంస్కరణలో రాష్ట్ర ప్రతినిధిగా భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఎర్రకోట నుంచి ఈ విషయంలో చేసిన చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ఈ సంస్కరణలను ఆమోదించింది. రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్నా.. సామాన్యుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానాలను బలంగా సమర్థించారు. ఆర్థిక ఆటుపోట్లను భరిస్తూ కూడా సంస్కరణల వల్ల ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉన్నా.. జీఎస్టీ సంస్కరణలకు ముందుండి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఈ చారిత్రక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం… సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని పెంచి, వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి, పన్నుల విధానంలో పారదర్శకత తీసుకురానుంది. ఈ చారిత్రాత్మక సంస్కరణ పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార, పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది.
పజలకు, ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైన సంస్కరణ
ప్రజల పొదుపుని పెంచడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేందుకు, కొత్త పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి ఇది దోహదపడుతుంది. జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అత్యధికంగా ఉపయోగించే వస్తువుల సేవలకు డిమాండ్ పెంచి, ఉత్పత్తులను విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది. ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు చాలా లాభదాయకమైన సంస్కరణగా పవన్ పేర్కొన్నారు.
పెరగనున్న గ్రామీణ ప్రజల ఆదాయం
రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు పరికరాలు, ఇన్‌పుట్స్‌పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి బలపడతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు, పెరుగు, పన్నీర్ లాంటి నిత్యవసరాలపై పన్ను 5 శాతం నుంచి 0 శాతానికి తగ్గించడం ద్వారా రోజు వారి వ్యయాన్ని తగ్గించినట్టు అవుతుంది. నెయ్యి, వెన్న, వంట పాత్రలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కుటుంబ బడ్జెట్‌కి చాలా ఉపశమనం కలిగిస్తుంది. సబ్బులు, షాంపూలు, పేస్టులు వంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ద్వారా వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగవుతుంది. మధ్య తరగతి కోసం కార్లు, ఫ్రిజ్ లు, టీవీలు, ఏసీలపై పన్ను 18 శాతానికి తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. గృహ నిర్మాణానికి అవసరం అయిన సిమెంటు మీద పన్ను 18 శాతానికి తగ్గించడం నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని పవన్ అన్నారు.
ఆరోగ్య రంగానికి ఊతం
ఆరోగ్య రంగంలో ఔషధాలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికీ, అత్యవసర మందులపై పన్ను 5 శాతం నుంచి 0కి తగ్గించడం ద్వారా రోగులకి కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. జీవిత ఆరోగ్య బీమాపై పన్ను 0 శాతానికి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. ఎంఎస్‌ఎంఈలకు వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులు తగ్గించటంతో పోటీ వాతావరణం పెరుగుతుంది. విద్యా రంగానికి సంబంధించిన వస్తువులపై పన్ను తగ్గింపు విద్యను మరింత అందుబాటులోకి తీసుకువస్తుంది. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజల చేతుల్లో నగదు పెరుగుతుంది. తద్వారా వస్తువుల వినియోగం మరింత పెరిగి నూతన పెట్టుబడుల సేకరణకు ఉపయోగపడుతుంది. వాణిజ్య పరిశ్రమలకు సంబంధించి జీఎస్టీ సంస్కరణల అమలుకి సహకరించిన అన్ని వాణిజ్య సంఘాలు, పారిశ్రామిక సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందని పవన్ స్పష్టం చేశారు.
ప్రజలకు అవగాహన కల్పిద్దాం
జీఎస్టీ సంస్కరణల లాభాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం చేపట్టాలి. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ప్రజలను నేరుగా కలిసి వారికి ఎలా లబ్ధి చేకూరుతుందో చెప్పాలి. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలను ఆహ్వానిస్తూ వాటిని విజయవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తుందని పవన్ తెలిపారు.