- నవంబర్ లో విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతమే లక్ష్యం
- గ్లోబల్ లీడర్లకు ఆహ్వానం
- ఏపీలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలపై ప్రెజెంటేషన్
- 15 నెలల్లో రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు అనుమతి
- మరో ఏడాదిలో రెట్టింపు చేయటమే టార్గెట్
అమరావతి (చైతన్యరథం): పెట్టుబడుల వేటలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ యూకే రాజధాని లండన్ వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఒప్పించటం ఆయన పర్యటన ప్రధాన లక్ష్యం. ఆయా సంస్థల అధినేతలతో సమావేశమై సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అమలుచేస్తున్న పెట్టుబడుల, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించి సానుకూల స్పందనతో వారిని రాష్ట్రానికి రప్పించటమే ధ్యేయంగా మంత్రి లోకేష్ లండన్ చేరుకున్నారు. ఈ క్రమంలో.. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025లో గ్లోబల్ పాల్గొనాల్సిందిగా లీడర్లను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ మంగళవారం రాత్రి లండన్లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా మంగళవారం రాత్రి 7గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30గంటలకు) ఈ రోడ్ షో ప్రారంభమయింది.
ఇందులో యుకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షూల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంకు యుకే విభాగం సిఇఓ రాఘవ్ సింఘాల్, ఎపిఐఐసి వైస్ చైర్మన్, ఎండి అభిషిక్త్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, గత 15నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వివరించారు.
గత 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5. 10,06,799 5 2 122 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం లక్ష ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరో ఏడాదిలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. లండన్ రోడ్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న సానుకూల అవకాశాలపై మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ప్రఖ్యాత సంస్థలైన హిందుజా, రోల్స్ రాయిస్ వంటి గ్రూప్లతో ప్రత్యేక సమావేశాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పెట్టుబడిదారులతో ఫైర్సైడ్ చాట్ నిర్వహించారు.
రోడ్ సందర్భంగా ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీరంగం వంటి అంశాలను మంత్రి లోకేష్ ప్రముఖంగా ప్రస్తావించారు. పెట్టుబడులతోపాటు శాశ్వత ఆర్థికావకాశాలను ఇన్వెస్టర్లకు వివరించారు. రోడ్ షోలో ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సియాంట్, ఇవాంటె గ్లోబల్, ఏఐ ఓపెన్సెక్, లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతర పరిశ్రమ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నవంబర్ లో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్కు రావాల్సిందిగా గ్లోబల్ కంపెనీల సీఈఓలు, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ట్రేడ్, టెక్నాలజీ, స్థిరమైన వృద్ధి అంశాలపై లండన్ రోడ్ షోలో కీలక చర్చలు జరిగాయి.