- లక్ష్య సాధన దిశగా అడుగులేద్దాం
- మానవ వనరును సద్వినియోగం చేయాలి
- శాంతిభద్రతలతోనే పెట్టుబడులు సాధ్యం
- 35 శాతం క్రైం రేట్ తగ్గించగలగాలి..
- సాంకేతిక వినియోగంపై పూర్తి దృష్టిపెట్టండి
- ఉన్న వనరులే ప్రగతి సాధన ఆయుధాలు
- ‘అంతిమంగా స్వర్ణాంధ్ర-2047 సాధనే లక్ష్యం
- స్పష్టం చేసిన మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- కలెక్టర్ల సదస్సు ముగింపు సెషన్లో దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): సీఐజీఆర్ 13.49 శాతం వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “రాష్ట్రానికి ఏటా కావాల్సిన ఆదాయం రూ.76వేల కోట్లు. గతేడాది 12.02శాతం వృద్ధి సాధించాం. కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుంది. కొన్ని జిల్లాల్లో వృద్ధి లేదు. వృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. దీర్ఘకాలం ప్రయోజనాల దృష్ట్యా పది సూత్రాలు తీసుకువచ్చాం. ఉపాధి కల్పనకు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం సాధించాలి. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ఒక కుటుంబం.. ఒక వ్యాపారవేత్త నినాదం తీసుకున్నాం. నైపుణ్యం పోర్టల్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఉపాధి కల్పనతో ఆదాయం సృష్టి జరుగుతుంది. మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఈ ఏడాది 35శాతం క్రైమ్ రేటు తగ్గాలి. జిల్లాల్లో పరిస్థితులమేరకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. అన్ని కార్యాలయాల్లో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమివ్వాలి. రాయలసీమకు సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ కు మారాల్సిన అవసరం ఉంది. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ భారం తగ్గుతుంది. సర్క్యులర్ ఎకానమీలో పోలీసు వ్యవస్థ భాగస్వామ్యం కావాలి” అని సీఎం వివరించారు.
రెండు రోజులపాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలని ఆదేశించారు. గత పాలకులవల్ల రాష్ట్రం చాలా అవకాశాలను కోల్పోయిందంటూ.. తిరిగి వృద్ధిరేటు. సాధనకు రాజీలేకుండా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘పదిసూత్రాల ఆధారంగా కూటమి పరిపాలన కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనకు మనకున్న వనరుల్ని వినియోగించి ముందుకెళ్లాం. మానవ వనరుల్ని సమర్ధంగా వినియోగించుకునేలా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందుకే -వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్, వర్క్ ఫ్రమ్ హోంలాంటి విధానాలను అవలంబిస్తున్నాం. నేను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 35శాతం క్రైమ్ రేట్ తగ్గించే లక్ష్యంతో జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు పనిచేయాలి. అందుకు -సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని లక్ష్యాలను చేరుకోండి. గ్రీన్ ఎనర్జీకి అత్యంత
ప్రాధాన్యత, ఈవీలను ప్రోత్సహించాలి. ఇక -క్లీన్ అండ్ గ్రీన్ సంప్రదాయంగా మారాలి. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులను సమర్థంగా వినియోగించుకుని లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలి అభివృద్ధి- సంక్షేమం- సుపరిపాలనే లక్ష్యంగా
కూటమి పనిచేస్తోంది.. పబ్లిక్ పాలసీలవల్ల కొన్ని దేశాల భవిష్యత్ మారిందన్న విషయం గ్రహించండి. త్వరలోనే భారత్ 2వ అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుంది.
శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. వైద్యారోగ్యరంగంలో ఇక పెనుమార్పులు వస్తాయి. సంజీవని అందుబాటులోకి వస్తే వైద్యానికి చేసే వ్యయం కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం వైద్యారోగ్యానికి రూ.20 వేల కోట్లు ఖర్చవుతుంది. అందరూ ఆరోగ్యంగావుంటే ఈ వ్యయంలో 30 శాతం తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలవల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుంది. దేశాన్ని నిర్మించే క్రతువులో మీరంతా భాగస్వాములవ్వాలి. టెక్నాలజీ గేమ్ చేంజర్. దాన్ని సద్వినియోగం చేసుకుంటే నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు” అంటూ సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఎన్ఎండీ ఫరూక్, సీఎస్, డీజీపీ సదస్సులో పాల్గొన్నారు.