- కేటాయించిన కేంద్రం, వివిధ పోర్టుల ద్వారా 18 లోపు రవాణా
- రైతులకు మరింత వెసులుబాటు
- యూరియాపై వైసీపీ దుష్ప్రచారం
- వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765, మంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 మెట్రిక్ టన్నుల యూరియా ఈ నెల 16 నుండి 18 వ తేదీలోపు రవాణా జరుగుతుందని వెల్లడిరచారు. ఈ కేటాయింపుతో రైతులకు వెసులుబాటు లభిస్తుందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అధిక మొత్తంలో యూరియాను కేటాయించేలా చర్యలు చేపడుతున్న సీఎం చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి అచ్చెన్న అన్నారు.
వైసీపీ కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. రైతులను ఆందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలన్న వైసీపీ ఎత్తుగడ ఫలించబోదన్నారు. రైతు సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని, నేడు మాత్రం తప్పుడు ప్రచారాలతో రైతాంగాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నమ్మకం కోల్పోయిన పార్టీగా వైసీపీ మిగిలిపోయిందని, వారి నాటకాలకు రైతాంగం మోసపోరని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.