- జాతీయ సదస్సులో సంతృప్తికరంగా చర్చలు
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తిరుపతి (చైతన్యరథం): ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మహిళలు ముందుకువస్తేనే సాధ్యపడుతుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని ప్రసంగించారు. మహిళలను విద్యావంతులను చేయాలని, వారిని ప్రోత్సహించాలని సూచించారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు అందించాలి. వారు విద్యావంతులైతే వృద్ధి సాధించగలం. ఏటా ఇలాంటి సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. 3 ఏళ్లలో ఏపీకి రాజధాని సిద్ధం అవుతుంది. అప్పుడు అమరావతిలోనూ ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఇవ్వాలి. ఈ సదస్సులో ప్రముఖులు ఇచ్చిన సూచనలు మహిళల్లో ఆత్మవిశాసం పెంచేలా ఉన్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సులో చాలా గొప్పగా చర్చలు జరిగాయని వెల్లడిరచారు. ఈ చర్చలు తనకు ఆనందాన్ని కలిగించాయన్నారు. పురుషులతో భాగంగా మహిళలకు సమాన హక్కులు ఏపీలో ఇప్పటికే ఇచ్చామని గుర్తుచేశారు. ఇది ఏపీకి మాత్రమే పరిమితం కాకూడదని… దేశం మొత్తం అమలయ్యేలా తీర్మానం చేసి అమలయ్యేలా చేయాలని సూచించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అధికారంలోకి వచ్చాకే మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యం మొదలైందని గుర్తుచేశారు. అందరం కలిసి నడిస్తేనే మహిళా సాధికారత కార్యరూపం దాలుస్తుందని అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు.