తిరుపతి (చైతన్యరథం): మహిళా సాధికారత కేవలం మహిళలనే కాదు.. మొత్తం సమాజాన్నే వృద్ధి పథంలో నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండో రోజు సోమవారం కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు పురాణాల్లో కనిపించవని చెప్పారు. మన వేదాలు, ఉపనిషత్తులు మహిళలను గౌరవించాలని చెబుతున్నాయన్నారు. వారికి గౌరవం లేని చోట ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. రాజా రామ్‌మోహన్ రాయ్ బాల్య వివాహాల రద్దు, వింతంతు పునర్వివాహ చట్టాలను తీసుకువచ్చారు. మార్పు మాత్రమే లోకంలో శాశ్వతమైనది. కుటుంబ సంతోషం ఆ ఇంట్లో మహిళల ఆనందంపై ఆధారపడి ఉంటుంది. ఇదే రాష్ట్రానికి, దేశానికి వర్తిస్తుంది. మొల్ల రామాయణం రాసిన కవయిత్రి మొల్లకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. కేవలం ఆస్తుల్లో భాగస్వామ్యం లేకపోవడం వల్ల మహిళలు చాలా సార్లు తండ్రి, సోదరుడు, భర్తపై ఆధారపడతారు. పురుషాధిక్యత సమాజంలో వారికి రెండో స్థానం ఇచ్చారు. కానీ సమాజ నిర్మాణానికి మహిళలే సరైన ఆర్కిటెక్ట్లు. భారత రాజ్యాంగం అందరినీ సమానంగా గుర్తిస్తుంది. లింగ సమానత్వానికి రాజ్యాంగంలో ప్రాధాన్యత ఉంది.
మహిళలు ఎన్నో సవాళ్లను దాటి రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వారి హక్కులను కాపాడేలా తీర్పులు ఇచ్చింది. ఆయా తీర్పులు హక్కులను కాపాడటంలోనే కాదు. సమాజ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించాయి. భారతదేశంలో మహిళల సమానత్వానికి మతం ఎంతో పెద్ద పాత్ర పోషించిందని నొక్కిచెప్పారు. ఒక కుటుంబంలో మహిళ ఆనందంగా ఉంటే… ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని… ఇదే దేశం మొత్తానికి వర్తిస్తోందని పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. మహిళల రక్షణ, హక్కుల కోసం అనేక చట్టాలను భారతదేశం చేసింది. అయితే మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకుపోవటంలో ఇండియా ఇంకా వెనుకబడే ఉందన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించటంలో 193 దేశాల్లో 148వ ర్యాంకులో భారతదేశం ఉంది. మిజోరం వంటి రాష్ట్రాల్లో ఒక్క సభ్యురాలు కూడా అసెంబ్లీలో లేరు. మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. రువాండాలో 30 శాతం పార్లమెంటరీ సీట్లు కేటాయిస్తూ చట్టం చేసిన కొద్ది కాలానికే అక్కడ వృద్ధి అనూహ్యంగా పెరిగింది. రాబోయే రోజుల్లో అమలు కానున్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు మన దేశంలో ఈ పరిస్థితిని మారుస్తుంది. ఇది ప్రపంచానికి భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పనుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.