- కట్టకుండానే కట్టేశామని అబద్ధాలు చెబుతున్నారు
అమరావతి (చైతన్య రథం): మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని జగన్ చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము ప్రైవేట్‌వారికి అప్పగించడం లేదని.. పీపీపీ పద్ధతిలోనే చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, నిర్వహణ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. అమరావతిలో శుక్రవారం వే 2 న్యూస్ కాంక్లేవ్‌కు హాజరైన ముఖ్యమంత్రి.. మెడికల్ కళాశాలల అంశంపై బలమైన సమాధానమే ఇచ్చారు. బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి లేదని జగన్ గ్యాంగును హెచ్చరించారు. కాలేజీలను ఎక్కడా ప్రైవేటుకు అప్పగించటం లేదని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాలవల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని.. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒకటికి వందసార్లు ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సంజీవని ద్వారా సాంకేతికతతో అందరికీ ఆరోగ్యాన్ని అందించేలా ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రమంతటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వైద్య చికిత్సలు ఇంటెన్సివ్ కేర్‌లో కాకుండా ఇంటిదగ్గరే అందేలా సాంకేతికత తీసుకువస్తున్నామన్నారు. పోలవరం బనకచర్ల లింకుపై అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ.. ఒకప్పుడు రాయలసీమలో పదేళ్లలో ఎనిమిదేళ్లు కరవు ఉండేదన్నారు. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం. కానీ నీళ్లు ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందన్నారు. గతంలో ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేదని, ఇప్పుడు హంద్రీనీవాతో నీళ్లు ఇచ్చాక పరిస్థితి మారిందన్నారు. నీళ్లు ఇచ్చిన తర్వాత గోదావరి జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఉద్యాన పంటల వల్లే ఇది సాధ్యమైందన్నారు. కేవలం సముద్రంలో వృధాగాపోయే జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పీ`4 ద్వారా పేదరికంలేని సమాజంతోపాటు ఆర్ధిక అసమానతలు రూపుమాపేందుకే నిరంతరం శ్రమిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.