- ఆరోగ్య బీమా పథకాల్లో వయస్సు పరిమితి తొలగించాలి
- వృద్ధ మహిళలకు ప్రత్యేక రాయితీలు, సులభ వడ్డీతో రుణాలు
- కేంద్రానికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచన
- వికసిత్ భారత్‌పై కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్
అమరావతి (చైతన్యరథం): ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల చట్టాలపై దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని కేంద్రానికి రాష్ట్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సూచించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ అధ్యక్షతన వికసిత్ భారత్ 2027 వీడియో కాన్ఫరెన్స్ సమావేశం గురువారం జరిగింది. వెలగపూడి సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి డా. స్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి స్వామి ఈ కింది అంశాలు ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల చట్టాలపై దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలి. ఆరోగ్య బీమా పథకాలలో వయస్సు పరిమితి తొలగించాలి. వయో వందన హెల్త్ ఇన్సూరెన్స్ అర్హత వయస్సును 70 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించాలి. వృద్ధ మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించి సులభ వడ్డీతో రుణాలు ఇవ్వాలి. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై పాఠశాలలు, కళాశాలల స్థాయిల్లో విద్యార్థులకు పాఠ్యాంశం ప్రవేశపెట్టాలి. డీ-అడిక్షన్ సెంటర్ల సిబ్బందికి వేతనాలు నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బందితో సమానంగా పెంచాలి. పాఠశాలలు, కళాశాలల్లో జెండర్ సెన్సిటైజేషన్ మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలి. విద్య, ఉపాధి, వ్యాపారరంగంలో ట్రాన్స్‌జెండర్స్‌కి సహాయం అందించాలని సమావేశంలో మంత్రి స్వామి సూచించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమశాఖ మంత్రులు పాల్గొన్నారు.