- యూరియాపై చెప్పేవన్నీ అసత్యాలే
- మెడికల్ కాలేజీలపై మతిలేని మాటలు
- బెంగళూరు నుంచి వారానికోసారు రాష్ట్రానికి
- అబద్ధాలు వల్లెవేసి తిరుగుపయనం
- జగన్‌రెడ్డి తీరుపై ఎద్దేవా
- నేపాల్లో చిక్కుకున్న తెలుగుప్రజల తరలింపులో మంత్రి లోకేష్ కృషికి అభినందనలు
అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచిన జగన్ రెడ్డి నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019-24 మధ్య ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని, ప్రజలు ఎన్నడు లేని దుస్థితిని అనుభవించారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం అడుగుతున్నారని, కానీ అది తాము ఇచ్చేది కాదని, అది ప్రజలు ఇచ్చేదని స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత జగన్ పిచ్చి మరింత ముదిరిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారంలో ఒకరోజు వచ్చి పూర్తిగా అబద్ధాలు చెప్పి, మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారని, 16 నెలలుగా ఇదే కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ఈ అబద్ధాలను నమ్మి ప్రజలు మళ్లీ మోసపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తరపున వాస్తవాలను తెలియజేస్తున్నామని వివరించారు.
జగన్మోహన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వైద్య కళాశాలలు, రైతుల సమస్యలపై మాట్లాడారని.. అయితే ఈ రెండిరటిపైనా ఆయనకు కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. తమ ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా రోడ్లమీదికి రాలేదని నిస్సిగ్గుగా మాట్లాడారని, ఇది విడ్డూరంగా ఉందన్నారు. యూరియా సమస్యపై జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన పాలనలో ఎవరికైనా బయటికి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించిన తర్వాత రైతులు ఆందోళన చెందారని దీనికి తోడు కొన్ని ఫేక్ మీడియా ఛానెళ్లు, పత్రికలు యూరియా దొరకడం లేదని దుష్ప్రచారం చేశాయన్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో అకాల వర్షాల వల్ల, మరికొన్ని జిల్లాల్లో ముందుగా వర్షాలు రావడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని, దీనివల్లే ఒకటి రెండు వారాలు సమస్య ఏర్పడిరదని వివరించారు. ఈ సమస్యను భూతద్దంలో చూపించి రైతులు అల్లాడిపోతున్నారని జగన్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
తప్పుదోవ పట్టించే యత్నం
జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో ప్రచురించిన తప్పుడు ఫోటోలు, వీడియోలు చూపిస్తూ రాష్ట్ర రైతులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసిందని తెలిపారు. ఇప్పటివరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని చెప్పారు. సెప్టెంబర్ 22 నాటికి మరో 55,115 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తున్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి బతుకే అవినీతి, ఆయనది అవినీతి పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. యూరియాలో రూ.250 కోట్ల అవినీతి జరిగిందని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, రైతులకు ఇచ్చే దానిపై ఎవరైనా అవినీతి చేస్తారా అని ప్రశ్నించారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70% యూరియా మార్క్‌ఫెడ్ ద్వారా, 30% ప్రైవేటు డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని, ఎక్కడా అధిక ధరలు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, అయినప్పటికీ తమ ప్రభుత్వం వాటిని అధిగమించడానికి కృషి చేస్తోందని వివరించారు. మిర్చి, కొబ్బరి, పొగాకు, టమోటా, ఉల్లి వంటి పంటలకు ధరలు తగ్గినప్పుడు తమ ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మామిడి ధర తగ్గితే ఒక్క మామిడి కాయనైనా కొన్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఉల్లి ధరలు పడిపోయినప్పుడు కనీసం సమీక్ష కూడా చేయని జగన్, నిత్యం ప్రజల గురించి, రైతుల గురించి పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం దౌర్భాగ్యమని మంత్రి అచ్చెన్నాయుడు తప్పుబట్టారు.
పునాదులు మాత్రమే..
జగన్ మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వెళ్లారని, కానీ వాటి నిర్మాణాలు పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పుడు తాము పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో వాటిని పూర్తి చేయాలని ప్రయత్నిస్తే అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని జగన్ బెదిరిస్తున్నారన్నారు. పీపీపీ మోడల్‌లో 50% సీట్లు ప్రభుత్వానికి ఉంటాయని, అయినా జగన్‌కు ఈ విషయం తెలియదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
లోకేష్ కృషికి అభినందనలు
అలాగే నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడానికి యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న కృషిని అచ్చెన్నాయుడు అభినందించారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సభకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సిన లోకేష్, తెలుగువారిని రక్షించడమే తన బాధ్యతగా భావించి అమరావతిలోనే ఉండి నిరంతరం కృషి చేశారని చెప్పారు. ఇదే నిజమైన నాయకత్వమని, కేవలం అధికారం ఉంటేనే పనిచేస్తాననే ఆలోచన సరైంది కాదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని రక్షించాలని దృఢ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి వారిని ఉత్తరాఖండ్‌కు పంపి, అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సొంత డబ్బులతో విమానాల్లో సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ఇది నాయకత్వానికి అసలైన నిదర్శనం అని, కేవలం అధికారం ఉన్నప్పుడే కాకుండా, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడమే నిజమైన నాయకుడి లక్షణమన్నారు. గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యేలలను మాత్రమే గెలిపించి ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించకుండా, ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి రానని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుందని, జగన్ వచ్చి అడిగే ప్రతి ప్రశ్నకు తాను సమాధానం ఇస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.