- తెలుగువారికి కష్టం వస్తే అరక్షణం ఆగడు
- యువనేత చొరవ.. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్రవాసులందరూ స్వస్థలాలకు
- సంక్షోభ సమయంలో తక్షణ స్పందన
- ప్రత్యేక విమానాలు, వాహనాలు ఏర్పాటు
- ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి 144 మంది
- బీహార్ సరిహద్దు ద్వారా భారత్ లోకి 22 మంది
- సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా దేశ సరిహద్దులోని నేపాల్ గంజ్‌కు 12 మంది
- ఆర్టీజీఎస్ సెంటర్ నుండి రెండురోజులు నిరంతర సమీక్ష
- ఢిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారులతో సమన్వయం
- మంత్రి లోకేష్ క్రైసిస్ మేనేజ్‌మెంట్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు
అమరావతి (చైతన్యరథం): నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ చూపిన ప్రత్యేక చొరవ ఫలించింది. చిక్కుకున్న వారందరూ గురువారం ఏపీకి చేరుకున్నారు. అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజల కోసం నారా లోకేష్ తక్షణమే స్పందించి వారితో సమన్వయం చేసుకున్నారు. అందర్నీ ఒక చోటికి చేర్చి వారి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి విశాఖ, రేణిగుంట విమానాశ్రయాలకు చేర్చారు. అక్కడనుండి తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్ళకి చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అలెర్ట్‌గా ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. నేపాల్‌లో చిక్కుకున్న ప్రతి తెలుగువారిని రక్షించేవరకు హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగనుంది.
సంక్షోభంలో చురుకుగా..
నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి మంత్రి లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్న విషయం తెలిసిందే. బాధితులు.. వారి కుటుంబాల సమాచారం, సహాయం పొందడానికి ఏపీ ప్రభుత్వ హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢల్లీిలోని ఏపీ భవన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారుల సమన్వయంతో వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అక్కడ చిక్కుకున్న పౌరులతో నేరుగా మాట్లాడి.. వారికి రక్షణ, భద్రతకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఏపీ పౌరులను నారా లోకేష్ ప్రత్యేక విమానంలో సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది నేపాల్‌లోని కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 104 మంది కాగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 40 మంది ఉన్నారు. విమానంలో ప్రయాణికులు జయహో చంద్రబాబు, జయహో నారా లోకేష్ నినాదాలతో హోరెత్తించారు. తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమను సురక్షితంగా తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ఈ విమానం ఏర్పాటు చేశారంటూ చేతులెత్తి నమస్కరించారు. అనంతరం జై చంద్రబాబు, జై నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు విశాఖ విమానాశ్రయంలో ఏపీ వాసులకు.. ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, అతిథి గజపతిరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, కోళ్ల లలిత కుమారి, కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, పలువురు అధికారులు స్వాగతం పలికారు.
ఉత్తరాంధ్రకు చెందిన వారిని విశాఖలో దింపిన అనంతరం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 40 మందితో ప్రత్యేక విమానం విశాఖ నుంచి రేణిగుంట చేరుకుంది. అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వారంతా స్వస్థలాలకు చేరుకున్నారు.
వివిధ మార్గాల ద్వారా..
వివిధ గ్రూపులుగా నేపాల్ లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు చిక్కుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చి.. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసింది. వీరంతా ఖాట్మాండు, హేటౌడా, పోక్రా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మంత్రి లోకేష్ ప్రయత్నాలు ఫలించి నేపాల్ లోని హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది తెలుగువారు బీహార్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. అటు నేపాల్‌లోని సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని భారత సరిహద్దులోని నేపాల్ గంజ్‌కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో వీరు హైదరాబాద్ చేరుకున్నారు. 144 మందిని ప్రత్యేక విమానంలో విశాఖ, రేణిగుంట విమానాశ్రయాలకు చేర్చారు. నేపాల్‌లో చిక్కుకున్న ప్రతి తెలుగువ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్‌కు ఈ సందర్భంగా ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
నిరంతర సమీక్ష
గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢల్లీిలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఏపీ వాసులకు అవసరమైన ఆహారం, నీరు, ఇతర సౌకర్యాల కల్పించేలా అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఢల్లీిలోని ఏపీ భవన్ ఏర్పాటుచేసిన అత్యవసర హెల్ప్ లైన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు. ప్రత్యేక విమానాల కోసం పౌర విమానాయాన మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపారు.
ఆర్‌టీజీఎస్ వార్ రూమ్ నుంచి మంత్రి లోకేష్ బుధ, గురువారాల్లో నిర్వహించిన సమీక్షలో ఢల్లీి లోని ఏపీ భవన్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, బండిరెడ్డి రాము, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, కోన శశిధర్, కాటంనేని భాస్కర్, కృతిక శుక్లా, అజయ్ జైన్, నారాయణ భరత్ గుప్తా, ప్రఖర్ జైన్, తదితరులు పాల్గొన్నారు.
చిక్కుకున్నవారికి ముందుగా భరోసా
నేపాల్లో తెలుగు వారు చిక్కుకున్నారని తెలిసిన వెంటనే.. వివిధ మార్గాల ద్వారా మొత్తం ఎంత మంది ఉన్నారో సమాచారం సేకరించారు. వారికి ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లేలా చేశారు. ఎవరూ కంగారు పడవద్దని.. అందర్నీ సురక్షితంగా ఆంధ్రకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఇంటర్నెట్ ఇతర సదుపాయాలు లేకున్నా.. వారిని ప్రభుత్వం నిరంతరం మానిటర్ చేస్తుందన్న నమ్మకాన్ని కలిగించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో కలసి..నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని గుర్తించడంతో పాటు వారిని వీలైనంత త్వరగా.. భారత భూభాగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేశారు. చాలా మందిని బుధవారం అర్థరాత్రి సమయానికే బీహార్‌లోకి తీసుకు వచ్చారు. ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా..భయపడకుండా.. వారిని భారత భూభాగంలోకి తెచ్చి.. అక్కడినుంచి ఏపీకి తీసుకువచ్చారు.
ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షణ
ఏపీ ప్రభుత్వానికి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ ఆర్టీజీఎస్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. పక్కా సమాచారంతో.. అక్కడి నుంచి సహాయకార్యక్రమాలను పర్యవేక్షించవచ్చు. మంత్రి లోకేష్ .. ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థను పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. వాస్తవానికి దీనిపై అధికారులకు బాధ్యతలు అప్పగించి లోకేష్ బుధవారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ ` సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్లిపోవచ్చు. అయితే కూటమి సభలో తాను పాల్గొనడం కన్నా.. నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సీఎం చంద్రబాబు సూచనలతో అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే రెండు రోజులు గడిపిన మంత్రి లోకేష్, నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారితో ముఖాముఖి ఆన్‌లైన్‌లో చర్చించారు. తిరిగి తీసుకువస్తామని భరోసా కల్పించారు. చేసి చూపించారు. సంక్షోభ సమయాల్లోనూ వెనుకడుగు వేయకుండా నాయకత్వం వహించగల సామర్థ్యాన్ని మంత్రి లోకేష్ మరోసారి నిరూపించుకున్నారు.
సాయంలో ఎప్పుడూ ముందే..
తెలుగువారి సంక్షేమం కోసం ఎప్పటికీ మొదటి స్థానంలో నిలబడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి తన తక్షణ స్పందనా సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లయింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఉత్తరాఖండ్, సిమ్లా వంటి ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా ప్రత్యేక విమానాల్లో తీసుకు వచ్చిన చరిత్ర టీడీపీకి ఉంది. 2014లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సిమ్లాలో బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు అయిన ఘటనలోనూ టీడీపీ చురుగ్గా స్పందించి బాధితులకు అండగా నిలిచింది. అధికారంలో లేనప్పుడు కూడా.. పార్టీ సానుభూతిపరుల సాయంతో.. బాధితులకు అండగా నిలిచింది.
దేశవ్యాప్తంగా ప్రశంసలు
నారా లోకేష్ చేసిన ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా.. దానిని నిశితంగా అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను ఎంపిక చేసుకుని.. వాటిలో బెస్ట్ ఆప్షన్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం క్రైసిస్ మెనేజ్‌మెంట్. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ అత్యుత్తమ పరిణితి ప్రదర్శించారు. నేపాల్ సంక్షోభంలో తెలుగు వాళ్లు చిక్కుకున్నారని తెలిసిన వెంటనే, సహాయం కోసం వారు ఎదురు చూస్తున్నారని తెలిసిన మరుక్షణం ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇరవై నాలుగు గంటల్లో వారిని సురక్షితంగా ఏపీకి తీసుకువచ్చారు.