- రాయల సీమను రతనాల సీమ చేయాలన్నదే సంకల్పమని వ్యాఖ్య
- సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం మాది: పల్లా
- సూపర్ సిక్సే కాదు, సూపర్ సిక్సర్లే..: పీవీఎన్
- తక్కువ టైంలోనే సూపర్ హిట్ కొట్టాం: మంత్రి సవిత
అనంతపురం (చైతన్య రథం): ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘సూపర్ సిక్స్ -సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమనురతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. “ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పించాం. ఒకేరోజు రికార్డుస్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం” అని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులను తట్టుకుంటూ.. ప్రజలు బాగుండాలనే లక్ష్యంతో కలసికట్టుగా పని చేస్తున్నామన్నారు. పార్టీలు వేరైనా, ప్రజాశ్రేయస్సే ప్రధానంగా కూటమి కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రతీ కుటుంబానికి 25 లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా కల సాకారం కానుందని వ్యాఖ్యానించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్1 స్థానంలో నిలబెడతామని స్పష్టం చేశారు. శాఖాపరంగా 15 నెలల్లో అమలు చేసిన కార్యక్రమాలను పవన్ కల్యాణ్ వివరించారు.
సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం మాది: పల్లా
సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టిస్తున్నప్రభుత్వం తమదని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెలిపారు. 3 ప్రాంతాల్లో ఏవిధంగా చిచ్చు పెట్టాలన్నదే జగన్ ఆలోచనలని మండిపడ్డారు. సూపర్ 6 హామీలతోపాటు యువ గళంలో నారా లోకేశ్ ఇచ్చిన ప్రతీ హామీ అమలు దిశగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
సూపర్ సిక్సే కాదు, సూపర్ సిక్సర్లే..: పీవీఎన్
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. సూపర్ సిక్స్ కార్యక్రమం ప్రతీ ఇంట్లో వెలుగులు నింపే కార్యక్రమన్నారు. మాతృ భాష పరిరక్షణ కోసం కూటమి ఎంత వరకైనా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అంటూ కేవలం ఆరు హామీలకే కూటమి పాలన పరిమితం కాలేదని, అనేక సిక్సర్లు కొట్టే దిశగా కూటమి పాలన పరుగులెత్తుతోందని వ్యాఖ్యానించారు. 20 లక్షలమందికి మించి ఉపాధి లభించేలా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతం సెమీ కండక్టర్ హబ్గా మారనుందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ.
విధానం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు.
తక్కువ టైంలోనే సూపర్ హిట్ కొట్టాం: మంత్రి సవిత
అనతి కాలంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసి చూపామని బీసీ సంక్షేమ మంత్రి సవిత స్పష్టం చేశారు. సూపర్ సిక్స్కు మించిన హామీలను ఇప్పటికే అమలు చేశామన్నారు. వైఎస్సార్సీపీ పుట్టుక, చరిత్రే అబద్ధం, జగనే ఓ పెద్ద అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. పంచ భూతాలను సైతం గతంలో సైకో గ్యాంగ్ లూటీ చేసిందని ధ్వజమెత్తారు.
కరవు ప్రాంతాలు సస్యశ్యామలమయ్యాయని, కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత తెలిపారు. దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలెండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ఇంటింటా వెలుగులు నింపాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతీ పేదవాడికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి వచ్చిన నీటి ద్వారా రాయలసీమలోని కరవు ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయని వ్యాఖ్యానించారు.
కరవును తరిమికొట్టిన నాయకుడు చంద్రబాబని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రశంసిం చారు. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనపై ఎన్డీయే విజయోత్సవ సభను రాయలసీమగడ్డపై అనంతపురం జిల్లాలో నిర్వహిస్తుండటం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి శుభసమయంలో 15 నెలల్లోనే 85 శాతం హామీలను అమలు చేసి చూపించిన నాయకుడు చంద్రబాబు అని గర్వంగా చెప్పుకుంటున్నామని కొనియడారు. రాయలసీమలో వెనకబాటుతనాన్ని, కరవును తరిమికొట్టిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేసుకున్నారు. రాయలసీమలో మూడున్నర దశాబ్దాలపాటు వైఎస్సార్ ఫ్యాక్షన్ను ప్రోత్సహించి రాయలసీమ ప్రజలను కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని కాల్వ ఆరోపించారు. రాయలసీమ వెనకబాటు తనాన్ని పారద్రోలేలా చంద్రబాబు శ్రమించారని, ఆయన కృషి ఫలితంగా రాయలసీమలోని ప్రతి కుటుంబం ప్రగతిలో పయనిస్తోందని గుర్తు చేశారు. నేడు 3. వేల 873 కోట్లు ఖర్చు చేసి కుప్పానికి హంద్రీనీవా నీరు తరలించారని హర్షం వ్యక్తం చేశారు. సుమారు రాయలసీమలోని 4 జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీరు అందించి రైతులకు అండగా నిలిచారన్నారు..