- అనంతలో అదరహో అనిపించిన కూటమి బహిరంగ సభ
- సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అంటూ మార్మోగిన నినాదాలు
- ప్రజా దీవెనలతో హిట్ కాంబినేషన్ కొనసాగుతుందని ప్రకటన
- జనసంద్రంగా మారిన అనంతపురం సభా ప్రాంగణం
అనంతపురం (చైతన్య రథం): కూటమి పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోత్సవ సభఅదరహో అనిపించింది. బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం, పార్టీల శ్రేణులు హాజరయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో తమ హిట్ కాంబినేషన్ కొనసాగుతుందని కూటమి నేతలు సభావేదికగా ప్రకటించారు. అనంతపురంలోని ఇంద్రప్రస్తానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి 15 నెలల పాలనా విజయాలపై ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభబంపర్ హిట్టయ్యింది..
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సభా వేదికపైకి వస్తూనే కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్లు సూపర్ సిక్స్ జెండాలతో ర్యాంప్పైకి వెళ్లి పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేశారు. జెండాలు ఊపుతూ ఉత్సాహపరిచారు. ప్రతిగా ప్రజలు, పార్టీ శ్రేణులనుంచి అమితమైన స్పందన కనిపించింది. ఈలలు వేస్తూ, జై సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ నినాదాలతో విజయోత్సవ సభా ప్రాంగణం మార్మోగింది.
అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు రామరాజ్యం లక్ష్యంగానే కూటమి పరిపాలన సాగుతుందని ప్రకటించారు. సభా వేదికనుంచి ఆటో డ్రైవర్లకు ఊహించని కానుక ప్రకటించారు. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం కింద రూ.15 వేల రూపాయలు అందిస్తామని స్పష్టం చేశారు. ఏటా ఈ మొత్తం ఆర్థికసాయంగా వారికి అందుతుందని వరం ప్రకటించారు.
ఇక -రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రజలు, పార్టీల శ్రేణులు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. సభా ప్రాంగణాన్ని తెదేపా, జనసేన, భాజపా జెండాలతో తీర్చిదిద్దారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతలు కనిపించడంతో కూటమి నిండుదనం కొట్టొచ్చినట్టు కనిపించింది. కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమావేశంలో నేతలు ఏకరువు పెట్టారు. ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ నినాదాలతో సభా ప్రాంగణాన్ని కార్యకర్తలు హోరెత్తించారు.