- మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం
- విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం
- ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు
విశాఖ (చైతన్య రథం): ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతోపాటు వేగంగా, సమర్థవంతంగా చేరుతుందన్నారు. మీడియేషన్ అంశం భారత్‌కు కొత్తకాదని, తరాలుగా మనకు అందుబాటులో ఉందని గుర్తు చేశారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు ఓ సమర్ధవంతమైన మీడియేటర్‌గా వ్యవహరించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో మన పూర్వీకులు, గ్రామపెద్దలు సమర్ధంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని గుర్తు చేశారు. ‘‘విశాఖపట్నంలో జ్యుడీషియల్, మధ్యవర్తిత్వరంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించటం సంతోషదాయకం.
ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయవ్యవస్థ ఓ మూల స్తంభం. రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ. నిబద్ధతకు, నిష్పాక్షికతకు, పారదర్శకతకు పెట్టింది పేరు. కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైనా న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతీ పౌరుడికీ ఉంది. భారత్ అత్యంత వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తోంది. గత ఏడాదిగా ఏపీలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నాయి. కంపెనీలు, వ్యవస్థలు వస్తున్న నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి మీడియేషన్‌లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టం రావాలి. సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
విశాఖలో ఏడీఆర్ ఎకో సిస్టం ఏర్పాటుకు సిద్ధం
విశాఖలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెరిగిపోతున్న వివాదాలు, కేసుల పరిష్కారానికి కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయటంతోపాటు మీడియేషన్, ఆర్బిట్రేషన్‌కు కొత్త వ్యవస్థలు రావాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ చాలామంది పౌరులు కేసులు దాఖలు చేసి కోర్టులకు వెళ్లటం అవమానంగా భావిస్తారని.. అలాంటి పరిస్థితిలో మీడియేషన్ ప్రక్రియ చక్కని పరిష్కారమన్నారు. దేశం అమలు చేస్తున్న సంస్కరణలు, కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వివాదాలు తగ్గించుకోవటమే ఆర్ధిక వ్యవస్థకు కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలను రూపొందించుకోవాల్సి ఉందన్నారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చ్యువల్ హియరింగ్స్, ఈ-ఫైలింగ్, మొబైల్ అప్‌డేట్స్‌లాంటి సాంకేతికతను అమలు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు.