- విజయవాడ, తిరుపతిలో మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం
- మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడి
అమరావతి (చైతన్య రథం): లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడంతోపాటు వాటిని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో లిడ్ క్యాప్‌పై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో తిరుపతి, విజయవాడలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణంపై మంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్వీ ఆటోనగర్‌లోని 4.5 ఎకరాలు, విజయవాడ ఆటోనగర్‌లో ఎకరా లిడ్ క్యాప్ స్థలాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేసే అంశంపై సమీక్షలో సదీర్ఘంగా చర్చించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి డోలా తెలిపారు. సమీక్షలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, సోషల్ వెల్పేర్ సెక్రటరీ ఎంఎం నాయక్, లిడ్ క్యాప్ ఎండీ ప్రసన్న వెంకటేష్, ఈడీ టీవీఎస్ ప్రసాదరావు, సునీల్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.