- పనితీరును పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని వెల్లడి
- ఈ సారి విద్యార్థులతోపాటు తనకు కూడా పరీక్షేనన్న మంత్రి
- విద్యార్థులను కన్నబిడ్డల్లా భావించి నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచన
కమలాపురం (చైతన్యరథం): దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సికె దిన్నె ఎంపిపి పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్‌ను రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్‌ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 మంది విద్యార్థులకు 13 ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని పంపిస్తారు. న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్‌లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తారు. మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్‌ఓ ప్లాంటు నీటినే వంటకు ఉపయోగిస్తారు. ఆర్‌ఓ ప్లాంటు, ఆహార పంపిణీ వాహనాలను కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం శుచి, రుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించగలమని సిబ్బంది తెలిపారు. డిసెంబర్ కల్లా కడప జిల్లాలోని 11 మండలాల్లో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని స్మార్ట్ కిచెన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్‌ను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడ సరుకుల నాణ్యత, భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు. సికె దిన్నె స్కూలు స్మార్ట్ కిచెన్ పనితీరును బట్టి దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని మంత్రి తెలిపారు.
విద్యార్థులతో మంత్రి లోకేష్ భేటీ
ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థినుల తరగతి గదిని పరిశీలించిన లోకేష్, వారితో భేటీ అయ్యారు. గత ఏడాది కాలంగా తాము చేపట్టిన సంస్కరణలు ఎలా ఉన్నాయని విద్యార్థులను వాకబు చేసి, వారి నుంచి సలహాలు స్వీకరించారు. విద్యార్థినులు మాట్లాడుతూ… సెమిస్టర్ వైజ్ టెక్స్‌ట్ బుక్స్ విధానం అమలుచేయడం వల్ల తమకు మోతబరువు తగ్గిందని తెలిపారు. క్లాస్ లీడర్ జాస్మిన్ మాట్లాడుతూ… సన్నబియ్యం ఇస్తుండటం వల్ల మధ్యాహ్న భోజనం గతంకంటే ఇప్పుడు రుచిగా బాగుంటుందని చెప్పింది. తమ స్కూలులో కంప్యూటర్ ల్యాబ్స్, కొత్త బెంచిలు ఏర్పాటుచేయాలని, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచాలని కోరగా, సాధ్యమైనంత త్వరగా వాటిని కల్పిస్తామని మంత్రి తెలిపారు. లోకేష్ ముఖచిత్రంతో తాను వేసిన డ్రాయింగ్‌ను ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మంత్రికి బహుకరించింది. ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న యూనిఫామ్స్, బ్యాగ్స్ నాణ్యతపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. గతంకంటే ఇప్పుడు బాగున్నాయని, బ్యాగుల సైజ్ కొంచెం పెంచాలని విద్యార్థినులు సూచించారు. ఇంటర్నల్ ఎసెస్‌మెంట్ కోసం కొత్తగా ఇస్తున్న బుక్ లెట్స్ బాగున్నాయని తెలిపారు. సోషల్ స్టడీస్‌లో నాలుగు బుక్స్ ఉన్నాయని, వాటిని రెండిరటికి కుదించాలని కోరారు. ఇంగ్లీషు టెక్స్‌ట్ బుక్, సప్లిమెంట్ కలిపి ఒకే బుక్ గా ఇస్తే బాగుంటుందని చెప్పారు. తమకు ఆర్‌ఓ తాగునీటిని అందించాలని కోరగా, మంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తవుతుంది, మీరంతా కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలి, ఈసారి మీకు మాత్రమే కాదు, నాకు కూడా పరీక్షేనని విద్యార్థులతో మంత్రి లోకేష్ అన్నారు.
విద్యార్థి గంగిరెడ్డికి లోకేష్ అభినందన
సికె దిన్నె స్కూలు తరగతి గదులను సందర్శించినపుడు గంగిరెడ్డి గణేష్ రెడ్డి అనే పదోతరగతి విద్యార్థికి చెందిన నోట్ బుక్‌ను చూసిన లోకేష్… చేతిరాత చాలా బాగుందంటూ ప్యత్యేకంగా అభినందించారు. ఆ తర్వాత స్కూలు ప్రధానోపాధ్యాయుని శోభారాణితో మంత్రి లోకేష్ సమావేశమై విద్యాప్రమాణాల మెరుగుదలకు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ… ఎసెస్‌మెంట్ బుక్స్ వల్ల విద్యార్థులు రివిజన్ చేసుకోవడానికి బాగుంది, అయితే ఆ పుస్తకాలన్నీ టీచర్లు ఇంటికి తీసుకెళ్లి దిద్దడం కష్టంగా ఉందని అంటూ సైజు తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత ఏడాదికాలంగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం, పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నాం, ఒక్క పిటిఎం తప్ప మరే ఇతర విద్యేతర భారాన్ని టీచర్లపై మోపడంలేదు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా భావించి వారికి మెరుగైన విద్యనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, ఎమ్మెల్యేలు పుత్తా చైతన్య రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డివారి మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.