- సీజన్‌లోనే రైతులకు రుణాలివ్వాలి
- తరువాత ఇచ్చినా నిరుపయోగమే
- ఉన్నత విద్యకు ఊతమిచ్చేలా కార్యాచరణ
- బలహీన వర్గాలకు బాసటగా ఉండాలి
- నైపుణ్యాభివృద్ధి కోసం ఆర్థిక తోడ్పాటునివ్వండి
- అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు
- లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం… సహకరించండి
- పీ4లో బ్యాంకర్లు భాగస్వామ్యులవ్వాలి
- ఎస్‌ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూయర్ విధానంలో భాగంగా లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన జరగబోయే మహిళా దినోత్సవం నాటికి లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దినట్లుగా ప్రకటన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని… దీనికి బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్‌ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఏయే రంగాల్లో సహకారం కావాలనే అంశాన్ని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..గతంలో వన్ ఫ్యామిలీ… వన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటూ ప్రమోట్ చేశాం. ఇప్పుడు వన్ ఫ్యామిలీ… వన్ ఎంటర్ ప్రెన్యూయర్ అనే నినాదంతో పని చేస్తున్నాం. దీంట్లో భాగంగా మహిళలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించాం.
వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ నాటికి లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్దం చేశాం. దానికి బ్యాంకర్లు సహకరించాలి. బ్యాంకులు అందించే సహకారాన్ని అందుకుని ఏపీ డ్వాక్రా మహిళలు ప్రగతి పథాన నడుస్తున్నారు. ఇప్పటికే మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతున్నారు. వారికి మరింత తోడ్పాటు ఇచ్చే విధంగా వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని వారికి వర్తింప చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో వీలైనంత మేరకు మహిళలకు అవకాశం ఇస్తాం. డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు ఏ విధంగా సహకరించారో.. దీనికి బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఇన్నోవేషన్ కేంద్రాలకు… బ్యాంకర్లు అనుసంధానమవ్వాలి
యువత, మహిళ పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేలా రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించాం. ఇప్పటికే అమరావతిలో ప్రధాన కేంద్రం పనిచేయడం మొదలైంది. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, తిరుపతి వంటి చోట్ల ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వీరికి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ పార్టనర్లు ఉంటారు. దీనికి బ్యాంకర్ల నుంచి సహకారం ఉండాలి. ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే ఇన్నోవేషన్ హబ్‌లకు ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల ప్రతినిధులను అనుసంధానించాలి. ఇది స్టార్టప్‌లకు, నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కొత్త ఆవిష్కరణలకు సహకారం అందించే దిశగా ఆలోచనలు చేయాలి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను, విదేశీ విద్యను అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. యువత భవిష్యత్తు బంగారుమయం కావాలంటే విద్యకు ప్రాధాన్యమివ్వాలి. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు… ఉన్నత విద్య, విదేశీ విద్యను పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఉన్నత విద్యకు సహకరించేలా బ్యాంకర్లు తమ వంతు పాత్ర పోషించాలి. తక్కువ వడ్డీలతో రుణాలివ్వడం.. తక్కువ మొత్తాలతో అప్పు తీర్చే వెసులుబాటు కలిగించాల్సిన అవసరం ఉందని సీఎం వివరించారు.
ప్రజల కోసం… పేదల కోసం…
‘‘బ్యాంకర్ల సమావేశాలు అర్థవంతంగా జరగాలి. ఫలితాలిచ్చేలా ఉండాలి. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి. రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. ఈ పాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రస్తుతం ప్రపంచం అంతా వేగంగా మారిపోతోంది. బ్యాంకర్లూ మారాలి. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చింది. నెక్స్‌ట్ జనరేషన్ ఆఫ్ రిఫార్మ్స్ రావాలి. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించేలా కాకుండా… ప్రొత్సహించేలా ఉండాలి. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోంది. ఫాల్స్ లెండిరగ్ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరు, ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావు. పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలనూ చేపట్టాలి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం పీ4 కార్యక్రమం చేపట్టింది. ఇందులో బ్యాంకర్లూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు కోరారు.
రవాణా రంగానికి ఆసరాగా నిలవండి
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా చేపడుతున్నాం. పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ ప్రాజెక్టులు తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, అన్ని రకాల రవాణా సౌకర్యాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. దుగరాజపట్నం పోర్టు రాబోతోంది. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఏపీకి అతి పెద్ద తీర ప్రాంతం ఉంది. లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయి. లాజిస్టిక్స్ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 14 శాతంగా ఉంది. లాజిస్టిక్స్ వ్యయం సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా ఇన్ఫ్రా ప్రాజెక్టులు రావాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయల కల్పనలో పీపీపీ పద్దతిలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. అవసరమైతే దీనికి వయబులిటి గ్యాప్ ఫండిరగ్ ఇస్తాం. దీనికి ఐఐఎఫ్సీఎల్ వంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకర్లు సహకరించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండిరగ్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకులన్నీ కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయండి. క్యాంటం వ్యాలీ సేవల్ని కూడా వినియోగించుకోండి. ఆర్థిక లావాదేవీల భద్రత ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్వాంటం వ్యాలీ సేవలు ఉపకరిస్తాయి. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించండి. బ్యాంకులకు అవసరమైన భూమిని కేటాయిస్తాం. రెండేళ్లలో అమరావతిలో బ్యాంకులు తమ కార్యాలయాలను నిర్మించాలి. బ్యాంకుల బ్యాక్ ఎండ్ సర్వీసులను ఇక్కడి నుంచే అందించాలి. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మందుకు రావాలి. వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దమని సీఎం చంద్రబాబు సూచించారు.
బడుగులకు అండగా ఉండాలి
కౌలు రైతులకు రుణాలివ్వాలి. బడుగులు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. వారికి ఆర్థికపరమైన అండ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉండడంతోపాటు.. బ్యాంకర్లు కూడా సహకరించాలి. బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం వచ్చే దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలి. పీఎం సూర్యఘర్ వంటి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించాం. దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలి. సిబిల్ స్కోర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిబంధనలు చెబుతున్నాయి. దీన్ని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోవాలి. స్టార్టప్ ఇండియా, ముద్రా యోజన, పీఎంఈజీపీ, ఎఫ్‌ఎంఈ, స్వానిధి పథకాల్లో బడుగులకు ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
వివిధ రంగాల్లో రుణాలిలా…
232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వివిధ రంగాలకు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను వివరించారు. పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఎంత వరకు పురోగతి సాధించారనే అంశంపై సమీక్షించారు. మొత్తంగా వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా అన్ని రంగాలకు కలిపి రూ. 2,47,919 కోట్ల మేర రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. ఇందులో వ్యసాయ రంగానికి రూ.94,666 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.49,831 కోట్లు, ఇతర రంగాలకు రూ. 1,00,278 కోట్ల మేర రుణాలను ఇచ్చారు. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు రూ.985 కోట్ల రుణాల్ని మంజూరు చేశారు. ఆర్థిక ప్రమాణాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బ్యాంకులు బాగా పని చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నాగరాజు చెప్పారు.. సేద్యానికి ముందుగానే రైతులకు రుణ వితరణ జరగాలన్న సీఎం అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో పార్కు, మెమోరియల్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం రెండెకరాల భూమి కేటాయిస్తే ఆ పనులు పూర్తి చేస్తామని నాగరాజు ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్బీసీ ఛైర్మన్ నితీష్ రంజన్, సీడ్బీ సీఎండీ మనోజ్ మిట్టల్, ఎగ్జిమ్ బ్యాంక్ ఎండీ హర్ష బంగారి, కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు, పంజాబ్ నేషనల్ ఎండీ అశోక్ చంద్ర, ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.