విజయవాడ (చైతన్యరథం): మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ కేసులో 12 మంది నిందితులకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 12 మంది నిందితులను వివిధ జైళ్లకు పోలీసులు తరలించారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మిగిలిన 9 మంది నిందితులను విజయవాడ జైలుకు… అలాగే మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. మద్యం కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యం కావడంతో.. ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. మద్యం విక్రయాలతో వచ్చిన ఆదాయంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా భూములను రాజ్ కసిరెడ్డి కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాటిని సైతం జప్తు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.