- పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
అమరావతి (చైతన్యరథం): వైసీపీ పాలనలో చట్టాలను ఉల్లంఘించి అడ్డగోలు వ్యవహారాలు నడిపిన ఇద్దరు ఐపీఎస్ అధికారులకు మంగళవారం గట్టి షాక్ తగిలింది. జగన్ జమానాలో అగ్నిమాపక శాఖ చీఫ్‌గా, సీఐడీ అధిపతిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించగా, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై సస్సెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్‌గా, సీఐడీ అధిపతిగాను సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూటమి ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించిన సంగతి తెలిసిందే. గత వైసీపీ హయాంలో సంజయ్ పనిచేసినప్పుడు ఈ అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఆయా వర్గాలకు అవగాహన కల్గించడం విషయంలో ప్రభుత్వ నిధులను సంజయ్ దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. అలాగే అగ్నిమాపక శాఖలో ఎన్‌వోసీలు ఇచ్చేందుకు ముఖ్యంగా మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్‌ల కొనుగోళ్ల విషయంలో ఆ శాఖ అధిపతిగా ఉంటూ భారీ అవినీతికి పాల్పడినట్లు తేలింది.
ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై కొన్ని కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. మూడు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాతే సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు సంజయ్‌ను విజయవాడ జైలుకు తరలించారు.
సునీల్ సస్పెన్షన్ పొడిగింపు
మరో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై సస్సెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలు రుజువు కావడంతో సునీల్‌ను ఇప్పటికే ప్రభుత్వం న స్పెండ్ చేసింది. రెండు రోజుల్లో సస్పెన్షన్ ముగియనుండటంతో రివ్యూ కమిటీ దీనిపై సమీక్ష నిర్వహించింది. అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ కేసులు కీలక దశలో ఉన్నందున సస్పెన్షన్ ఎత్తివేస్తే సునీల్ కుమార్ సాక్ష్యాధారాలను తారుమారు చేసి, దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కమిటీ అభిప్రాయపడిరది. కమిటీ సిఫార్సుల ఆధారంగా సస్పెన్షన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని దీజీపీని ఆదేశించారు.