- సమర్థ నీటి నిర్వహణతో సత్ఫలితాలు
- ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- 80 శాతం పైగా నిండిన రిజర్వాయర్లు
- కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి 310 టీఎంసీల వినియోగం
- హంద్రీనీవా ద్వారా సీమ జిల్లాల ప్రాజెక్టులకు సమృద్దిగా నీళ్లు
- హంద్రీ నీవా కాలువల విస్తరణతో 738 కి.మీ మేర ప్రయాణించి కుప్పం చేరిన కృష్ణమ్మ
- ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రవాహాలతో సముద్రంలోకి వృథాగా 1969 టీఎంసీలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సమర్థ నీటి నిర్వహణ సత్ఫలితాలను ఇస్తోంది. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇరిగేషన్ అధికారులకు ఇదే విషయంపై చంద్రబాబు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. ప్రతీ వర్షపు చుక్కనూ ఒడిసి పట్టాలన్న లక్ష్యం మేరకు ఓవైపు రిజర్వాయర్లను నింపుతూనే మరోవైపు అన్ని నదీ బేసిన్ల ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దానికి అనుగుణంగా ఈ సారి కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా నదీ బేసిన్లలో అన్ని రిజర్వాయర్లలోనూ కలిపి ప్రస్తుతం 80 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి. కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులి చింతల ప్రాజెక్టులు గత నెలలోనే నిండాయి. పైనుంచి నిరంతర వరద ప్రవాహాలు కొనసాగుతుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి పంపుతున్నారు. ఇదే సమయంలో ఆయా ప్రాజెక్టుల నుంచి గరిష్ట మొత్తంలో నీటిని వివిధ లిప్టుల ద్వారా, కాలువల ద్వారా ఇతర రిజర్వాయర్లకు, చెరువులకు, పంటలకు మళ్లిస్తున్నారు.
ఈ ఏడాది జులై నెలలోనే కృష్ణాకు భారీ వరద రావడంతో పెద్ద ఎత్తున నీటికి సీమ ప్రాంతానికి తరలించి ప్రాజెక్టులు నింపుతున్నారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాలోని ఆయకట్టుకు ఈ ఏడాది జూన్ 1 తేదీ నుంచి ఇప్పటి వరకూ 52 టీఎంసీల నీటిని రైతులు వినియోగించుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సమర్థ నీటి నిర్వహణతో గతంతో పోలిస్తే ఈసారి అదనంగా 12 టీఎంసీల వినియోగం జరిగింది. గోదావరి బేసిన్‌లోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ద్వారా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను యథాతథంగా దిగువకు సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి డెల్టాలోని పంటల సాగుకు సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 70 టీఎంసీల మేర నీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. పెన్నా బేసిన్లో వెలిగోడులో 15 టీఎంసీలు, సోమశిలలో 56 టీఎంసీలు, కండలేరులో 31 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వంశధార బేసిన్లోని గొట్టా బ్యారేజీ నుంచి ఈ సీజన్లో 8 టీఎంసీల నీటిని ఆయకట్టుకు ప్రభుత్వం అందించింది. మొత్తంగా చూస్తే ఆగస్టు 24 నాటికి ప్రధాన జలాశయాల్లో 650 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.
సమర్థ నీటి నిర్వహణ- వినియోగం
ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్లలో కలిపి 309 టీఎంసీల నీటిని ఆయకట్టు అవసరాలకు వినియోగించారు. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 70 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 52 టీఎంసీలు, వంశధార నుంచి 8 టీఎంసీల మేర నీటిని కాలువలకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 156 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఈ ఏడాది హంద్రీ-నీవా ప్రధాన కాలువ ద్వారా మల్యాల ఎత్తిపోతల నుంచి రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న లక్షల ఎకరాల ఆయకట్టుకూ సాగునీరు అందిస్తున్నారు. హంద్రీనీవా కాలువల వెడల్పు చేయడంతో 738 కి.మీ ప్రయాణించి కృష్ణా జలాలు చిత్తూరు జిల్లా చివరి ప్రాంతాలకు చేరుతున్నాయి. కృష్ణా జలాలు ఇప్పటికే కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు సూచనలతో ఏడాది కాలంగా చేపట్టిన సమర్థ నీటి నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ ద్వారా పంటలకు అవసరమైన సాగునీరు సకాలంలో ఇవ్వడంతో పాటు… రానున్న కాలానికి అవసరమైన విధంగా రిజర్వాయర్లను నీటితో నింపుతున్నారు.
ఈ సీజన్ లోనే 1969 టీఎంసీలు సముద్రం పాలు
ఇలా సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో వరద నీటిని సద్వినియోగం చేసుకుంటున్నా… వివిధ నదీ బేసిన్ల నుంచి పెద్ద ఎత్తున నీరు సముద్రంలోకి వెళ్లింది. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో మన ప్రాజెక్టులు నిండగా మిగిలిన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా బేసిన్ల నుంచి ఈ సీజన్లో జూన్ 1 తేదీ నుంచి ఇప్పటి వరకూ 1969 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి నీరు ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ 1483 టీఎంసీల మేర సముద్రంలోకి వెళ్లింది. ప్రకాశం బ్యారేజి నుంచి డెల్టా అవసరాల వినియోగం తర్వాత సముద్రంలోకి ఈ సీజన్లోనే 468 టీఎంసీల నీరు వెళ్లింది. అలాగే వంశధార బేసిన్లో ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటికే 18 టీఎంసీలకు పైగా సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 4.38 లక్షలు, సాగర్ నుంచి 3.38 లక్షలు, పులిచింతల నుంచి 2.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి పంట కాలువలకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పైనుంచి వరద వస్తుండడంతో 3.42 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ రాష్ట్రాలనుంచి వరద వచ్చిన సమయంలో మన రిజర్వాయర్లు నింపుకున్నా…పెద్ద మొత్తంలో నీరు సముద్రంలోకి పోతోంది. నదుల అనుసంధానం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముందుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసుకుని గరిష్ట నీటి వినియోగం సాధించడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.