- మెప్మా సహకారం, ర్యాపిడో చొరవతో ఉపాధి పొందిన 1003 మంది మహిళలు
- తొమ్మిది నగరాల్లో సేవలు.. 3 నెలల్లో రూ.35 లక్షల ఆదాయం
- మహిళా సాధికారతే తమ ప్రాధాన్యమన్న మంత్రి లోకేష్
- ఇది ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరింత చేస్తామని ఉద్ఘాటన
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ మహిళలు సాధికారత దిశగా సరికొత్త మార్గంలో పయనిస్తున్నారు. మెప్మా సహకారంతో స్వయం ఉపాధి పొందుతూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ, ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ సొంతంగా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తదితర నగరాల్లో మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సొంత కాళ్లపై నిలబడేందుకు ర్యాపిడో ద్వారా కుటుంబానికి అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు.
‘ఒక కుటుంబం ` ఒక వ్యాపారవేత్తే’ స్ఫూర్తి
మహిళల స్వయం ఉపాధికి తొలి అడుగు ఈ ఏడాది మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పడిరది. అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడంతో మొదలైంది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ప్రారంభించిన ‘‘ఒక కుటుంబం ` ఒక వ్యాపారవేత్త’’ కింద మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్ (మెప్మా) సంస్థ ర్యాపిడో ద్వారా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించింది. అందులో భాగంగా తొలి దశలో తొమ్మిది పట్టణాల్లో 1000 మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పించారు. వీటిలో విశాఖపట్నంలో 400 వాహనాలు, విజయవాడలో 400, నెల్లూరు, గుంటూరులో 50 చొప్పున, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రిలో 25 వాహనాలు చొప్పున మహిళలకు అందజేశారు. వీటిలో 760 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కాగా, 240 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు ఉన్నాయి.
డ్వాక్రా, మెప్మా సహకారంతో..
ఈ వాహనాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన బ్యాంకు రుణాలు డ్వాక్రా సంఘాల మహిళల పేర్లతో మంజూరయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వారి కుటుంబ సభ్యులు వాహనం నడిపేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్టులను మెప్మా సిద్ధం చేసి, జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా సహకారం అందించింది. ఈ క్రమంలో ర్యాపిడో సైతం మహిళలకు సాధికారతనందించడంలో భాగస్వామ్యం కావడం విశేషం. కొత్తగా చేరిన వారికి ప్లాట్‌ఫామ్ ఫీజులో మూడు నుంచి నాలుగు నెలల వరకు మినహాయింపు ఇచ్చారు. అలాగే తొలి సంవత్సరం టూ-వీలర్, త్రీ-వీలర్ యజమానులకు నెలకు వెయ్యి రూపాయల ఈఎంఐ మొత్తాన్ని సాయంగా అందించారు. దీంతో ర్యాపిడో నడపడం ప్రారంభించిన గృహిణులకు తొలి రోజు నుంచే ఆదాయం ప్రారంభమైంది. అలాగే ఈఎంఐ, ఇంధన భారం కూడా తగ్గింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 1003 కుటుంబాలు లబ్ధి పొందగా, వారిలో 688 మంది ర్యాపిడోలో నమోదు అయ్యారు.
మహిళల విజయగాథలు
విజయవాడకు చెందిన వడ్లపూడి గ్లోరీ మంజు మార్చిలో ప్రభుత్వ సబ్సిడీతో స్కూటర్ కొనుగోలు చేసి ర్యాపిడో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు పది వేల వరకు సంపాదిస్తున్నారు. ‘‘ఇంటిపనులు పూర్తి చేసిన తర్వాత కొద్ది గంటలు ర్యాపిడో నడిపి వాహనం ఈఎంఐ మొత్తాన్ని చెల్లిస్తున్నాను. అలాగే కొంత సొమ్మును పొదుపు చేస్తున్నాను. సొంత కాళ్లపై నిలబడటం ద్వారా వస్తున్న ఆదాయం కన్నా ఆర్థిక స్వాతంత్య్రం లభించడంతో ఎక్కువ సంతోషంగా అనిపిస్తోందని మంజు చెబుతున్నారు.
విజయవాడలోని కండ్రిక ప్రాంతానికి చెందిన మాధవి తన భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబ బాధ్యతలను తాను స్వీకరించారు. ‘‘ఎస్సీ వర్గానికి చెందిన నేను బ్రహ్మానందరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాను. ఆయనకు పక్షవాతం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000 దివ్యాంగ పెన్షన్ మందులకు సరిపోతోంది. ఈ సమయంలో మెప్మా ద్వారా రుణం పొంది ఆక్టివా టూ-వీలర్ కొన్నాను. ర్యాపిడో వాహనం నడుపుతూ నెలకు రూ.12 వేల వరకూ సంపాదిస్తున్నాను. ఈఎంఐ చెల్లించడంతోపాటు ఇంటిని నడపడానికి ఆ ఆదాయం తోడ్పడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడకు చెందిన 45 ఏళ్ల బాడిస భవాని భర్త అనారోగ్యం బారిన పడటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి బాధ్యతను తలకెత్తుకున్న భవాని ఆదాయం సంపాదించాలని ఆలోచించారు. అదే సమయంలో మెప్మా అందిస్తున్న సహాయం గురించి తెలుసుకుని, అధికారుల సహకారంతో రూ.1.20 లక్షల విలువైన ఈ-స్కూటర్ కొనుగోలు చేసి ర్యాపిడోలో చేరారు. ప్రస్తుతం రోజుకు రూ. 500 నుంచి రూ. 700 వరకు సంపాదిస్తున్నానని ఇప్పుడు కుటుంబ పోషణ అనేది తనకు సమస్యే కాదని ఆనందంగా చెబుతున్నారు.
ప్రభుత్వ సహకారంతో..
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు రూ. 12,300 నుంచి ఆటోలకు రూ.36,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. మరోవైపు ప్రభుత్వ చొరవకు తమ వంతు సహాయంగా ర్యాపిడో ఈఎంఐ విషయంలో ఫీజు మినహాయింపునిచ్చింది. ఈ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ కావడంతో ఇంధన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ర్యాపిడో నడుపుతున్న మహిళలు నెలకు సుమారు రూ. 13 నుంచి 16 వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.
మూడు నెలల్లో 45 వేల రైడ్లు..
మెప్మా సహకారంతో ర్యాపిడో నడుపుతున్న మహిళా డ్రైవర్లు కేవలం మూడు నెలల్లో (మే, జూన్, జూలై) రికార్డు స్థాయిలో 45 వేల రైడ్లు పూర్తి చేశారు. మొత్తంగా రూ.35 లక్షల ఆదాయం సంపాదించారు. మహిళల విజయగాథల స్ఫూర్తితో రాబోయే ఏడాదిలో మరో 4 వేల 800 మందికి ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.
ఇది ఆరంభం మాత్రమేనన్న మంత్రి లోకేష్
మహిళలు సాధికారత సాధించాలనేది ప్రభుత్వ ఆలోచన అని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడంతోపాటు, అన్ని రంగాల్లోనూ వారిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ర్యాపిడోతో కలిసి రాష్ట్రంలో 1000 మందికి పైగా మహిళలు స్వీయ ఉపాధి సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత చేస్తామని మంత్రి నారా లోకేష్ వివరించారు.