అమరావతి (చైతన్య రథం): కుప్పం నియోజకవర్గాన్ని కృష్ణా జలాలు తాకడంతో `చిత్తూరు జిల్లా పండుగ చేసుకుంటోంది. జులై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనీవా ఫేస్-1 కార్యక్రమంలో విడుదల చేసిన నీటి ప్రవాహం దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల మేర ప్రవహించి కుప్పం చేరుకుంటున్నాయి. దిగువన ఉన్న చెరువుల్ని నింపుతూ.. కృష్ణా జలాలు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికపై వీడియో పోస్టు చేస్తూ.. ‘నాడు చెప్పా. నేడు చేసి చూపించా’ అని వ్యాఖ్యానించారు. ‘పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమను సస్యశామలం చేస్తానని చెప్పాను. ఆనాడు అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. పలమనేరు, పుంగనూరు, మదనపల్లెకు నీరిస్తానని చెప్పా. ఎవరు అడ్డుపడినా పులివెందులకూ నీరు తీసుకెళ్తానని ఆనాడే చెప్పా’నంటూ ఎక్స్ పోస్టులో చంద్రబాబు భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు నెలాఖరున కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద హంద్రీనీవా జలాలకు జలహారతి అర్పించనున్నారని తెలుస్తోంది. హంద్రీ నీవాతో కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు తగ్గనున్నాయి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్స్‌వేసి ట్యాంకర్ల నీటిని కాలువల్లో పోసి.. నీటిని వదిలినట్టు స్కిట్ ప్రదర్శించారు. ఆ దుస్సంఘటనతో వైసీపీ పరువు పోయింది. ఐదేళ్ల అధికార కాలంలో వైసీపీ కనీసం తట్టమట్టి కూడా పక్కనెట్టలేదన్న ఆగ్రహం ప్రజల్లో వేళ్లూనుకుంది. సార్వత్రిక ఎన్నికలో అనూహ్య విజయం సాధించిన కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు `హంద్రీనీవాను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పం పెట్టుకున్నారు. చంద్రబాబు గద్దెనెక్కిన క్షణం నుంచే యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా కాల్వ పనులు మొదలయ్యాయి. అనుకున్న సమయానికి ముందుగానే కృష్ణా జలాలను కుప్పం వరకూ తీసుకెళ్లి `అపర భగీరథుడు అనిపించుకున్నారు.