- ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు పరిశుభ్రతే కీలకం
- పెద్దాపురంలో మ్యాజిక్ డ్రెయిన్స్ పరిశీలించిన సీఎం చంద్రబాబు
పెద్దాపురం (చైతన్య రథం): మన ఇంటి పరిసరాలనుంచే పరిశుభ్రత మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తనుంచి సంపద సృష్టించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రెయిన్స్‌ను పరిశీలించారు. ఇళ్లనుంచి వచ్చే మురుగునీటిని ఏవిధంగా మ్యాజిక్ డ్రెయిన్ ద్వారా బయటకు పంపుతున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇళ్లలోని న్యూస్ పేపర్లు, ఇతర పనికిరాని వస్తువులను తీసుకుని వాటికి బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తున్న మొబైల్ వ్యాన్‌ను పరిశీలించారు. ఏ వస్తువులకు కిరాణా సరుకులను ఎన్ని ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమంలో భాగంగానే ప్రమాద, ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.
దుర్గాప్రసాద్, శానిటేషన్ సూపర్ వైజర్
మ్యాజిక్ డ్రెయిన్స్‌వల్ల నీరు ఎప్పటికప్పుడు ఇంకిపోతుంది. భారీ వర్షాలు వచ్చినా ఇబ్బంది ఉండదు. మురుగు నీరు నిల్వ ఉండని కారణంగా దోమల బెడదను చాలావరకూ నివారించవచ్చు. ఈ డ్రెయిన్స్ రెండు అడుగుల లోతుతో ఏర్పాటు చేశాం. రూ.65 వేలతోనే నిర్మాణం చేపట్టాం. వారానికి రెండుసార్లు పైపులు శుభ్రం చేస్తే సరిపోతుంది. పారిశుధ్య కార్మికులకు ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
స్థానికులతో ముచ్చటించిన సీఎం
మ్యాజిక్ డ్రెయిన్ల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి పారిశుధ్య కార్మికుల డ్రస్ వేసుకున్నారు. అనంతరం సంక్షేమ పథకాల అందుతున్న తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం అందిందా? అని స్కూల్ విద్యార్థులను స్వయంగా అడిగారు. దీంతో వారు డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు. అనంతరం స్థానిక మహిళలు, చిన్నారులతో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు.