- వైసీపీ అనైతిక రాజకీయంపై సీఎం నిప్పులు
- జగన్ పార్టీ కుట్రలు ఏకరువు పెట్టిన చంద్రబాబు
- ఏపీలో బొమ్మాళీ భూతమంటూ చమత్కారం
పెద్దాపురం (చైతన్య రథం): గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు తీస్తుంటే.. ప్రతిపక్ష హోదాకూడా దక్కించుకోని వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదకరమైన విషపూరిత ప్రచార రాజకీయాలతో రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. స్వచ్ఛతా ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో వైసీపీ దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టారు. వైసీపీ సాగించిన అత్యంత విషపూరిత ప్రచారాలైన పది అంశాలను సీఎం చంద్రబాబు ఏకరువు పెడుతూ.. రాష్ట్రంలో ఎలాంటి దుష్ట రాజకీయ పార్టీ ఉందో, వాళ్ల క్రిమినల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1. వివేకా హత్య కేసు: బాబాయి హత్య అనేది దేశంలోనే క్రిమినల్ పాలిటిక్స్‌కు కేస్ స్టడీ… అవునా? కాదా? తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారా లేదా?
2. కోడి కత్తి డ్రామా: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు కోడి కత్తి డ్రామా ఆడారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు ఎటుపోయిందో మీరే చూశారు. దీన్ని మిస్టరీగా మార్చారు.
3. గులకరాయి డ్రామా: సీఎంగా ఉండి గులకరాయితో హత్యాయత్నమంటూ కట్టుకథలతో ఎన్నికల డ్రామా ఆడారు.
4. డయాఫ్రమ్ వాల్: అసమర్ధతో, నిర్లక్ష్యంతో, అహంకారంతో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమై… ఆ నెపాన్ని మాపైనే నెట్టారు.
5. పింఛన్ల నిలిపివేత: 2024 ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వొద్దంటే.. ఏకంగా ఇంటికివెళ్లి పింఛను ఇవ్వడమే ఆపేశారు. అక్కడికి రా.. ఇక్కడికి రా.. అంటూ వాళ్ల రాజకీయం కోసం వృద్ధులను మండుటెండలో తిప్పారు. 16మంది వృద్ధుల ప్రాణాలు తీసి… దానికి చంద్రబాబు కారణమని సొంత మీడియా ద్వారా ఊదర గొట్టారు.
6. సింగయ్య మృతి: 2024 ఎన్నికల తీర్పు తరువాతా వాళ్లు మారలేదు. పరామర్శల పేరిట యాత్రలు చేస్తున్నారు. ఈ రాజకీయ ఉనికి యాత్రల కోసం అమానుషంగా తమ వెహికల్‌తో తొక్కించి సింగయ్య అనే కార్యకర్త ఉసురు తీశారు. వీడియో బయటపడే వరకు అసలు ఏంజరిగిందనే విషయాన్ని దాచిపెట్టారు. వీడియో బయటికి వచ్చాక.. సింగయ్య భార్యను ప్రలోభపెట్టి… అంబులెన్సులో చంపేశారని మనపైనే విమర్శలు చేయించారంటే వాళ్లు ఏస్థాయి క్రిమినల్స్ అనేది అర్ధం చేసుకోవాలి.
7. వీడియో మార్ఫింగ్: జనం తన కోసం ఎగబడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నెల్లూరు పర్యటనలో బంగారుపాళ్యం జనాన్ని మిక్స్‌చేసి చూపించారు.
8. మునిగింది రాజధాని కాదు: వైసీపీ ‘రాజధాని అమరావతిపై ఎప్పుడూ విషం కక్కే వైసీపీ… అమరావతి మునిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. అమరావతిపై విషం చిమ్మాలనే ప్రయత్నంలో రాష్ట్ర బ్రాండ్‌ను కూడా దెబ్బ తీస్తున్నారు. రాజధాని మునగలేదు. విష ప్రచారంలో వైసీపీ మునిగింది. రాజకీయంగానూ పూర్తిగా మునిగిపోతుంది.
9. పెట్టుబడులు వద్దంటూ లేఖలు: ‘తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కంపెనీలను వెళ్లగొట్టిన వైసీపీ పాలకులు… ప్రతిపక్షంలోనూ కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా సంస్థలకు లేఖలు రాస్తున్నారు.
10. పింఛన్లపై తప్పుడు ప్రచారాలు: ‘ఇప్పుడు మళ్లీ పింఛన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల హయాంలో వేలు, లక్షల మంది అనర్హులకు, పార్టీ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వీటిపై వెరిఫికేషన్ జరుగుతుంటే… 4 లక్షల పింఛన్లు తీసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్క పింఛను కూడా ఇప్పటికి తీయలేదు. అర్హులైన వారి ఏ ఒక్క పింఛనూ తీసేది లేదు. అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు ఇప్పించారు. అనర్హులకు ఫించన్లు ఇచ్చి.. అర్హులను వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అలా చేయదు. అనర్హులను పక్కన పెడుతుంది.. అర్హులకు పింఛన్లు ఇస్తుంది `అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో బొమ్మాళీ భూతం…
ఈ సందర్భంగా అరుంధతి సినిమా గుర్తుందా? అంటూ సీఎం సభికులను ప్రశ్నించారు. సభికులనుంచి ‘వదల బొమ్మాళీ..’ అంటూ సమాధానం వచ్చింది. దీంతో మీరే ఆ విషయం చెప్పండంటూ ముఖ్యమంత్రి సభికులకే మైక్ ఇచ్చారు. ‘వదల బొమ్మాళీ.. వదల’ అంటూ అరుంధతి సినిమాలో పశుపతి పాత్రధారి చెప్పిన డైలాగును సభికులు చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. అలాంటి భూతం మళ్లీ దుష్ప్రచారం చేస్తూ వస్తోందని.. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రజలకు జాగ్రత్త చెప్పారు. పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తాం. ఏదైనా ఊరిలో పరిస్థితులు సరిగా లేకుంటే ఆ ఊరిలో ఉండేవారికి పిల్లనిచ్చేందుకు వెనుకాడతాం. అలాగే ఓటు వేసేటప్పుడూ మంచీ, చెడూ ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు.