- ముంపు బాధితులకు మంత్రి నిమ్మల హామీ
- లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
- రూ.23 కోట్లతో కనకాయలంక వంతెన
- వరద గ్రామాల్లో మంత్రి పర్యటన
పాలకొల్లు (చైతన్యరథం): గోదావరి ముంపు ప్రాంతాల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. గోదావరి లంక గ్రామాల ప్రజలకు ఓటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వరదల సమయంలో భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శనివారం పాలకొల్లు నియోజకవర్గంలో గోదావరి వరద ముంపునకు గురైన కనకాయలంక, పెదలంక గ్రామాల్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల పర్యటించారు. ఆయా గ్రామాలకు పడవపై వెళ్లి వరద నీటిలో నడుస్తూ వెళ్లి గ్రామస్థులను పలకరించి వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వరదలొస్తే ఏరియల్ సర్వే పేరుతో గాలిలో చేసిన వాగ్దానాలు గాలిలోనే కలిసిపోయాయని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వంలో చిన్నపాటి వరదొచ్చినా, గడపకు నీరు తాకకుండానే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల ఇబ్బందులు తెలుసుకుంటున్నారన్నారు. గత పనిచేయలేని ప్రభుత్వానికి నేడు పనిచేసే ప్రభుత్వానికి తేడా ఇదేనన్నారు.
వరద సమయంలో కనకాయలంక కాజ్ వే ముంపుతో రాకపోకల నిలిచి ఎదురయ్యే ఇబ్బందులను శాశ్వతంగా తొలగేలా రూ 23 కోట్లతో వంతెన మంజూరయిందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా వంతెన పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామని చెప్పారు. వరద ముంపు గ్రామాల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ వరద నష్ట నివారణకు కృషి చేస్తున్నామన్నారు. వరద ముంపు బాధిత గృహాలను గుర్తించాలని అక్కడున్న అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు. వరద ముంపు గ్రామాల్లో అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాపించకుండా వైద్య శిబిరాల ద్వారా అవసరమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు.