న్యూఢిల్లీ (చైతన్యరథం): దేశ రాజధానిలో జరగనున్న ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడుని ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ నీరజ్ అగర్వాల్ సాదరంగా ఆహ్వానించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేస్తూ ఢిల్లీ అసెంబ్లీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభల పాత్ర, శాసనసభ్యుల బాధ్యతలు, పార్లమెంటరీ ప్రమాణాల బలోపేతం వంటి పలు అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చలు జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని, శాసన వ్యవస్థకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.