- ప్రైవేట్ దేవాలయాలు, అర్చకులను ఆదుకుంటాం
- బ్రాహ్మణుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలతో రండి
- ఇకపై శాలువాలు, బోకేలు తీసుకురావొద్దు… ఆశీర్వచనాలు చాలు
- బ్రాహ్మణ సంఘాల నేతలతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్
అమరావతి (చైతన్యరథం): బ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని విధాలా కట్టుబడి ఉంటానని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ బ్రాహ్మణ సంఘాలు శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుచ్చి రాంప్రసాద్‌ను కలిశారు. బుచ్చి రాంప్రసాద్ గత కొన్ని రోజులుగా టీడీపీ బ్రాహ్మణ సాధికార కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనను కలిసిన బ్రాహ్మణ సంఘాల నేతలతో బుచ్చిరాంప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణుల మేలు చేసే విషయాలపై, నూతన ఆలోచనలపై ఎప్పుడైనా తన దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. ఏపీబీఎస్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గ్రామాల్లో విరాళాలతో 5, 6 గుడులు కడుతున్నారు.. కానీ వాటి నిర్వహణ కష్టమవుతోంది. ధూప, దీపారాధన కూడా సరిగా జరగడం లేదని బుచ్చి రాంప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందిస్తూ ప్రైవేట్ దేవాలయాలను, వాటిలో పనిచేస్తున్న అర్చకులను ఆదుకునే బాధ్యత తనదని బుచ్చి రాంప్రసాద్ హామీ ఇచ్చారు. తాను పదవి దిగేలోపు బ్రాహ్మణులకు జీవిత బీమా కల్పించడంతో పాటు.. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరుస్తానని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా బ్రాహ్మణులు వేదాశ్వీరచనాలతో బుచ్చి రాంప్రసాద్‌ను సత్కరించారు. ఇకపై తన వద్దకు వచ్చే వారు శాలువాలు, బోకేలతో రావొద్దని, ఆశీర్వచనాలు ఇస్తే చాలని బ్రాహ్మణులను బుచ్చి రాంప్రసాద్ కోరారు. అనంతరం ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీబీఎస్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర కోశాధికారి పులిబాక ప్రసాద్, అర్చకులు, బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.