అమరావతి (చైతన్య రథం): ఢిల్లీవెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఏపీకి ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం పథకం కింద రూ.2,010 కోట్లు లభించాయని వివరించారు. రాష్ట్రంలో పెండిరగ్‌లోవున్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రూ.250 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తూర్పుప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి… ఈ పథకం ద్వారా ఏపీ ప్రయోజనం పొందగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీని విధివిధానాలు రూపొందించి త్వరగా పథకాన్ని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.