- ఏపీ మద్యం కుంభకోణం కేసు
అమరావతి (చైతన్య రథం): వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి చెందిన మరిన్ని విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కెసిరెడ్డి సహా పలువురు నిందితులు, పలు సంస్థలకు చెందిన రూ.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోల ద్వారా ఇప్పటికే అనుమతులిచ్చింది. తాజాగా.. మరో రూ.13 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతులు జారీ చేసింది.
వైకాపా హయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలుచోట్ల తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. వీటిని సీజ్ చేసేందుకు అనుమతించాలని సీఐడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. అక్రమ మద్యం వ్యాపారంనుంచి సంపాదించిన మొత్తం రాజ్ కెసిరెడ్డి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లె, మాచన్‌పల్లి గ్రామాల పరిధిలోని పలు సర్వే నెంబర్లలో రూ.కోట్ల విలువ చేసే 27.06 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లతో సహా సీఐడీ ఆధారాలు సేకరించింది. వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.13 కోట్లు కాగా.. మార్కెట్ విలువ ప్రకారం రూ.వంద కోట్ల పైనే ఉంటుందని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సీజ్‌కు ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో కెసిరెడ్డి రాజశేఖరెడ్డి ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని కోరుతూ విజయవాడలోని స్పెషల్ ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. కోర్టు తగిన విచారణ జరిపిన అనంతరం ఆస్తుల అటాచ్ మెంట్‌కు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.