- దివ్యాంగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు
- గత ప్రభుత్వంలో నకిలీ దివ్యాంగ సర్టిఫికేట్లతో దందా
- పింఛన్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్టు, అన్నివిధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి… ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది పెన్షన్ పొందుతున్నట్టు పరిశీలనలో తేలిందని తెలిపారు. అనర్హులైన పెన్లన్లు ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి నిర్ధారించినట్టు వెల్లడిరచారు. అయితే నకిలీ పింఛన్లను మాత్రమే తొలిగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారుకూ పింఛను రద్దు కాకూడదని సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు. అర్హులైన పింఛన్లు యధావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పింఛను, హెల్త్ పింఛను పొందేవారికీ ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.