- జన్యు పరీక్షల ప్రయోగశాల
- 3 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం
- వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి (చైతన్య రథం): గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు విశాఖ కెజిహెచ్‌లో సెంటర్ ఆఫ్ కాంపెటెన్స్ కేంద్రాన్ని (జన్యు పరీక్షల ప్రయోగశాల) ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదించినట్టు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిరచారు. ఇందుకు కేంద్రం రూ.4 కోట్ల నిధులను కేటాయించిందని, కేంద్రంలో పనిచేసే సిబ్బంది వేతనాలకు ఏటా రూ.25 లక్షల వెచ్చించనుందని తెలిపారు. అదనంగా మరో కేంద్రాన్ని మంగళగిరి ఎయిమ్స్ లేదా గుంటూరు జిజిహెచ్‌లో ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. మరో 3 నెలల్లో కేంద్రం ద్వారా జన్యుపర నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన తెగల్లో సికిల్ సెల్ వ్యాధి ఎక్కువగా ఉందన్నారు. మరో 25 ఏళ్లలో సికిల్ సెల్ వ్యాధిని అంతమొందించేందుకు కేంద్రం జాతీయ సికిల్ సెల్ నిర్మూలనను ప్రారంభించిందన్నారు.
సికిల్ సెల్ ప్రబలంగా ఉన్న ఏపీతోపాటు మొత్తం 17 రాష్ట్రాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతున్నట్టు మంత్రి వివరించారు. సికిల్ సెల్ వ్యాధి కలిగిన వారిలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతోందని, సికిల్ సెల్ వ్యాధి ముప్పు అధికంగా ఉన్న వారికి ముందస్తు పరీక్షలు (స్క్రీనింగ్) చేసినట్లయితే తర్వాతి తరాలకు వ్యాధి సంక్రమించకుండా నిరోధించవచ్చన్నారు. గిరిజనుల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సికిల్ సెల్ వ్యాధి భవిష్యత్ తరాలకు సంక్రమించకుండా నివారించేందుకు సెంటర్ ఆఫ్ కాంపెటెన్స్ కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తోందని, అలాగే వైద్య పరిశోధనలకు ఎంతగానో ఉపయుక్తమని మంత్రి పేర్కొన్నారు. విశాఖ కెజిహెచ్‌లో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ కాంపెటెన్స్ ప్రయోగశాలకు అవసరమైన పరికరాలను టెండర్ ద్వారా ఎపిఎంఎస్‌డిసి కొనుగోలు చేసే ప్రక్రియ మొదలైందని మంత్రి వెల్లడిరచారు.
కేంద్రం ద్వారా అందే సేవలు
సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు సెంటర్ ఆఫ్ కాంపెటెన్స్(సిఒసి) జన్యు పరీక్ష ల్యాబ్‌లో ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తారు. భవిష్యత్తు తరాలకు వ్యాధి సంక్రమించకుండా ఉండేందుకు సీవోసీలో వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. నవజాత శిశువుల స్క్రీనింగ్, గర్భిణిలకు ప్రసవానికి ముందు స్క్రీనింగ్ చేయడం, జన్యుపరమైన సలహాలివ్వడం, కౌన్సిలింగ్ చేయడంతోపాటు టెలీకన్సల్టేషన్ సదుపాయం సైతం ఉంది. వ్యాధి నిర్ధారణకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5 కేంద్రాలు పనిచేస్తున్నాయి.