- అర్హులైన నేతన్నలు అందరికీ అందాలి..
- డిసెంబర్‌కు 70 శాతం మేర మంజూరు చేయాలి
- నూతన చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేయండి
- మరింత ఆకర్షణీయంగా ఆప్కోలు
- చేనేత దుస్తుల అమ్మకాలపై అలసత్వం చూపొద్దు
- సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయండి
- నేతన్న సంక్షేమ పథకాలపై సక్సెస్ మీట్‌లు నిర్వహించండి
- చేనేత, జౌళి శాఖ సమీక్షలో మంత్రి సవిత ఆదేశం
మంగళగిరి/అమరావతి (చైతన్య రథం): అర్హులైన నేతన్నలందరికీ సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఫలాలు అందజేసేలా గ్రామస్థాయిలో అవగాహన సదస్పులు నిర్వహించాలన్నారు. ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని, ముఖ్యంగా నూతన డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులపై సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. మంగళగిరిలో చేనేత, జౌళి శాఖ కమిషనరేట్‌లో బుధవారం ఆ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. కమిషనర్ రేఖారాణి చేనేత, జౌళి శాఖలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వన్ డిస్ట్రిక్ `వన్ ప్రొడెక్ట్ కింద రాష్ట్రవ్యాప్తంగా 36 ఉత్పత్తులు గుర్తించినట్టు వివరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వన్ డిస్ట్రిక్ `వన్ ప్రొడక్ట్‌గా కింద జిల్లాలో మరిన్ని ఉత్పత్తులను ఎంపిక చేయాలని సూచించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఓడీ ఓపీ అవార్డుల్లో 9 అవార్డుల ఏపీకి రావడం సంతోషకరమన్నారు. వచ్చే ఏడాది మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 93 వేల చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గం కలిగిన 11,488 కుటుంబాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామంటూ.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు.
నూతన సంఘాలు ఏర్పాటు చేయండి…
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని మంత్రి సవిత వెల్లడిరచారు. నూతన సహకార సంఘాల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సహకార సంఘాల ఏర్పాటులో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నూతన సహకార సంఘాల ఏర్పాటుపై తరుచూ సమీక్షలు చేయాలని కమిషనర్ రేఖారాణిని మంత్రి సవిత ఆదేశించారు.
డిసెంబర్‌లోగా 70 శాతంమేర ముద్ర రుణాలివ్వాలి…
2025-26లో ముద్ర రుణాలు ఎంతమందికి ఇచ్చారో మంత్రి సవిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నేతన్నలందరికీ ముద్ర రుణాల సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలో ఉన్న బ్యాంకర్లతో చర్చించి, రుణాల మంజూరు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి నిర్దేశించిన లక్ష్యంలో 70 శాతం మేర ముద్ర రుణాలు అందించాలని స్పష్టంచేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సవిత తెలిపారు.
ఆప్కో అమ్మకాలు పెంచండి…
రాష్ట్రంలో ఉన్న 92 ఆప్కో షోరూమ్‌ల ద్వారా అమ్మకాలు మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ఆప్కో షోరూమ్‌ల ద్వారా గతేడాది 35.60 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. కస్టమర్లకు వేగవంతమైన సేవలు అందించాలని, షోరూమ్‌లను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు. నూతన డిజైన్లతో రూపొందించిన దుస్తులను షోరూమ్‌ల్లో ప్రదర్శనగా పెట్టాలన్నారు. ముఖ్యంగా ఈ`కామర్స్ ద్వారా అమ్మకాలు పెంచాలన్నారు. సోషల్ మీడియా ద్వారా చేనేత దుస్తులపై విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ఎయిర్ పోర్టుల్లో ఉన్న ఆప్కో షోరూమ్‌ల్లో చేనేత దుస్తులతోపాటు హస్త కళా రూపాలను కూడా అమ్మకానికి పెట్టాలని మంత్రి సవిత ఆదేశించారు.
సక్సెస్ మీట్‌లు నిర్వహించండి…
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత చేనేతల సంక్షేమానికి, అభివృద్దికి అమలు చేస్తున్న పథకాల గురించి సక్సెస్ మీట్ లు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. చేనేతలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇటీవల ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. త్రిఫ్ట్ ఫండ్ నిధులు కూడా మంజూరు చేశామన్నారు. 5 శాతం మేర జీఎస్టీ మినహాయింపుపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేతన్న భరోసా పథకం పేరుతో చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. ఈ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో సక్సెస్ మీట్ లు నిర్వహించాలని చేనేత, జౌళి శాఖాధికారులకు మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, వివిధ జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.