శ్రీశైలం (చైతన్య రథం): శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ అటవీశాఖ ఉద్యోగులు ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు టైగర్, మార్కాపురం డివిజన్లోని నెక్కంటి రేంజ్ అటవీ ఉద్యోగులపై మంగళవారం రాత్రి 10 గంటలకు శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం వద్ద ఎమ్మెల్యే, అనుచరులు దాడి చేశారని శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెక్కంటి రేంజ్ ఉప అటవీ అధికారి రామ్‌నాయక్, బీట్ అధికారులు గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరీముల్లాపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీ సిబ్బందితో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.