- కరకట్ట పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
- అధికారులకు రెవెన్యూ మంత్రి అనగాని ఆదేశం
అమరావతి (చైతన్యరథం): ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేశామని స్పష్టం చేశారు. కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వాయుగుండం దృష్ట్యా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. కృష్ణానది పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నదిని, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని భరోసా ఇచ్చారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.